నటరాజన్ (పాత చిత్రం)
సాక్షి, చెన్నై : తమిళనాడు మాజీ సీఎం, దివంగత నేత జయలలితకు రాజకీయ సహాయకుడిగా శశికళ భర్త నటరాజన్ వ్యవహరించేవారు. ఒకానోక దశలో రాజకీయాలను వదిలేద్దామని నిర్ణయించుకున్న జయలలితను అడ్డుకున్న ఆయన.. తర్వాత ఆమె వెన్నంటి ముందుకు నడిపించారు. ‘జయ రాజకీయ నీడ’గా నటరాజన్‌ను అభివర్ణించే విశ్లేషకులు ఆయన మృతి నేపథ్యంలో ప్రస్థానాన్ని గుర్తు చేస్తున్నారు.
మార్చి 1989 జయలలిత ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో సభలో జరిగిన ఘోర అవమానానికి మనస్థాపం చెంది తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ లేఖను తన కార్యదర్శి ద్వారా ఆమె స్పీకర్‌కు పంపారు. అయితే పోయెస్ గార్డెన్‌లోని తన అనుచరుల ద్వారా విషయం తెలుసుకున్న నటరాజన్ ఆ లేఖను తన దగ్గరికి తెప్పించుకుని దానిని జాగ్రత్తగా తన ఇంట్లో భద్రపరిచారు. తర్వాత జయను ఒప్పించి ఆమె నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చేశారు.
అదే ఏడాది తేనీ ఈశ్వరన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎంకే ప్రభుత్వం నటరాజన్ ఇంటిపై తనిఖీలకు ఆదేశించింది. ఆ సమయంలో ఈ లేఖ బయటపడగా.. అధికారులు దానిని మీడియాకు కూడా విడుదల చేశారు. ఆ రకంగా జయను రాజకీయ సన్యాసం తీసుకోనీయకుండా అడ్డుకున్న నటరాజన్ తర్వాత.. ఆమె రాజకీయ ప్రస్థానంలో కీలక పాత్ర పోషించారు.
జయను నేనే సీఎం చేశా... ఈ మాట తరచూ నటరాజన్ నోటి నుంచి మీడియా పూర్వకంగానే వెలువడుతూ ఉండేది. తమిళ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా ఉండాలని ఆయన ఎప్పటికప్పుడు పరితపిస్తూ ఉండేవారు. ఏదో ఒక రోజు జయలలిత ప్రధాని అవుతారని.. తాను తమిళనాడు ముఖ్యమంత్రిని అయి తీరుతానని నటరాజన్ తరచూ అనుచరులతో ప్రస్తావిస్తూ ఉండేవారంట.
ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన నటరాజన్ మురుతప్ప.. ప్రభుత్వ ఉద్యోగిగా.. వ్యాపారస్థుడిగా.. అంతకు మించి జయలలితకు నమ్మిన బంటుగా ఉన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వ ఉద్యోగం కోల్పోయిన ఆయన.. ఆ సమయంలో కలెక్టర్‌గా ఉన్న చంద్రకళకు సహయకుడిగా పని చేశారు. ఆ సమయంలోనే ఆయన భార్య శశికళ వీడియో పార్లర్ ద్వారా జయలలితతో పరిచయం ఏర్పడింది. ఆ స్నేహం క్రమంగా బలపడి.. ఎంజీఆర్ మరణం తర్వాత నటరాజన్-శశికళ దంపతులు జయ పంచన చేరారు. అప్పటి నుంచి ఆమె తీసుకునే రాజకీయ నిర్ణయం ప్రతీదాంట్లో నటరాజన్ తన ప్రభావం చూపుతూ వచ్చారు. నటరాజన్‌కి ఉన్న రాజకీయ పరిజ్ఞానాన్ని నమ్మి చీఫ్, హోం సెక్రెటరీల నియామకం దగ్గరి నుంచి.. నిధుల కేటాయింపులో సైతం ఆయన సలహాలు తీసుకుని జయలలిత నిర్ణయాలు ప్రకటించేవారు. అదిగో ఆ వ్యవహారమే తర్వాత వివాదాస్పదంగా మారింది. జయను చాలా విషయాల్లో ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నాడీఎంకే శ్రేణుల నుంచి కూడా విమర్శలు వినిపించాయి. అయినప్పటికీ ఆమె మాత్రం నటరాజన్‌కు ప్రాధాన్యం ఇవ్వటం మానలేదు.
జాతీయ స్థాయి నేతలు సైతం తన ఇంట ఆతిథ్యం తీసుకునేంత స్థాయికి నటరాజన్ పేరును అప్పటికే ఆయన సంపాదించుకున్నారు. అయితే ఒకానోక దశలో తన హోదాకే ఎసరు పెట్టే స్థాయికి నటరాజన్ చేరుకోవటం, పైగా మన్నార్‌గుడి మాఫియా పేరిట అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడంతో ఆయన్ని జయలలిత వేద నిలయానికి దూరం పెట్టారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ ఆయన్ని రాజకీయ ముఖచిత్రం నుంచి పక్కకు తప్పుకునేలా చేశాయి. జయలలిత మరణానంతరం తిరిగి తెరపైకి వచ్చిన నటరాజన్.. రాజకీయాలకు మాత్రం దూరంగానే ఉన్నారు. చివరకు అక్రమాస్తుల కేసులో భార్య శశికళ అరెస్ట్ తర్వాత ఆరోగ్యం బాగా క్షీణించటంతో తుదిశ్వాస విడిచారు.
Comments
Please login to add a commentAdd a comment