కేంద్ర మాజీ మంత్రిపై సీబీఐ చార్జ్ షీట్
చెన్నై: టెలికాం మాజీ మంత్రి, డీఎంకే నేత దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి మారన్‌లపై సీబీఐ అధికారులు చార్జ్ షీటు దాఖలుచేశారు. ప్రైవేట్ టీవీ(సన్ టీవీ నెట్ వర్క్) ఛానల్‌కు అక్రమంగా 764 హైస్పీడ్ ఇంటర్నెట్ డాటా కనెక్షన్లు (ఎయిర్ సెల్-మాక్సిస్)ప్రొవైడ్ చేసిన కేసులో మారన్ సోదరులు నిందితులుగా ఉన్నారు. చెన్నైలోని స్పెషల్ కోర్టులో మారన్ సోదరులతో పాటు మరికొందరు నిందితులపై అవినీతి నిరోధక చట్టం పరిధికి లోబడి చర్యలు తీసుకోనున్నట్లు సీబీఐ వెల్లడించింది. ఫోర్జరీ చేశారని ఆరోపణలు కూడా వెల్లువెత్తిన విషయం తెలిసిందే.
ఎలాంటి బిల్లులే లేకుండా 764 హైస్పీడ్ ఇంటర్నెట్ డాటా కనెక్షన్లు ఇవ్వడం వల్ల బీఎస్ఎన్ఎల్ సంస్థతో పాటు చెన్నై, ఢిల్లీకి చెందిన ఎంటీఎన్ఎల్ టెలికాం కంపెనీలు 1.78కోట్లు నష్టపోయాయి. అయితే ఆ సమయంలో సన్ టీవీ నెట్వర్క్ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించిన కళానిధి మారన్ సహా ఆ టీవీ ఇద్దరు ఉన్నత అధికారులు, ఆయన అనుయాయుల పేర్లను చార్జ్‌షీటులో చేర్చినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. గత రెండేళ్లకు పైగా టెలికాం స్కామ్ కేసు విచారణ కొనసాగుతోంది.