
కార్తీ చిదంబరం అజ్ఞాత నేరస్తుడు: కేంద్రం
ఈ ఏడాది మేలో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, కార్తీ చిదంబరం ఇళ్లపై డిల్లీకి చెందిన సీబీఐ అధికారులు దాడులు చేసి అనేక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో విచారణకు హాజరు కావాల్సిందిగా కార్తీ చిదంబరానికి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ సమన్లు అందుకున్న కార్తీ విచారణకు హాజరుకాకుండానే విదేశాలకు వెళ్లిపోయారు. కొన్ని నెలలుగా విదేశాల్లోనే గడుపుతున్న కారణంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ భారత్ వెతుకుతున్న అజ్ఞాత నేరస్తుడి జాబితాలో కార్తీ చిదంబరాన్ని చేర్చినట్లుగా శుక్రవారం ప్రకటించింది. విదేశీయానంపై నిషేధం విధించడంతోపాటూ లుక్-అవుట్ సర్క్యులర్‌ను అన్ని విమానాశ్రయాలకు పంపింది. కాగా, వెతుకుతున్న నేరస్థుడిగా తనను ప్రకటించడాన్ని సవాలు చేస్తూ కార్తీ చిదంబరం తరపున ఆయన న్యాయవాదులు మద్రాసు హైకోర్టులో శుక్రవారం పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై ఈనెల 7వ తేదీన విచారణ జరగనుంది.