
షీనాబోరా కేసులో కీలక మలుపు
ముంబయి : మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన షీనాబోరా హత్యకేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. ఈ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న ఇంద్రాణీ ముఖర్జియా, మరో ఇద్దరు నిందితులపై సీబీఐ స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పదిరోజుల కిందట మహారాష్ట్ర ప్రభుత్వం షీనాబోరా హత్య కేసును సీబీఐకి అప్పగించిన విషయం విదితమే.
ఇంద్రాణీ, ఆమె మాజీ భర్త సంజయ్ ఖన్నా, అప్పటి వారి కారు డ్రైవర్ శ్యామ్ వర్ పింటురామ్ రాయ్ పేర్లను ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. అయితే, కిడ్నాప్, హత్య, సాక్ష్యాలు తారుమారు చేసినందుకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి తమ వద్ద ఉన్న రిపోర్టును రాష్ట్ర డీజీపీ సంజీవ్ దయాల్ సీబీఐకి అప్పగించారు. 2012, ఏప్రిల్ 24న షీనాబోరా హత్యకు గురైన విషయం విదితమే.