
ఢిల్లీ సీఎంఓలో సీబీఐ దాడులు
కేజ్రీవాల్ కార్యదర్శి ఆఫీసులో సోదాలు
నన్ను లక్ష్యంగా చేసుకునే దాడులు.. కార్యదర్శి సాకు మాత్రమే: కేజ్రీ
♦ జైట్లీ అక్రమాలపై ఫైలు కోసమే సీబీఐ సోదాలు చేసింది
♦ నన్ను ఎదుర్కోలేక మోదీ పాల్పడుతున్న పిరికి చేష్టలివి
♦ మోదీ పిరికిపంద.. ఉన్మాది: ఢిల్లీ సీఎం ధ్వజం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో రాజకీయ దుమారం చెలరేగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య కార్యదర్శి కార్యాలయంపై సీబీఐ మంగళవారం దాడులు చేసింది. సీబీఐ తన కార్యాలయంలో సోదాలు చేసిందని.. దీనికి ప్రధాని నరేంద్ర మోదీయే కారణమని కేజ్రీవాల్ పరుష పదజాలంతో ఆరోపణలు గుప్పించారు. మోదీ ఒక పిరికిపంద, ఉన్మాది అని అభివర్ణించారు. ఢిల్లీ క్రికెట్ సంఘంలో అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆ సంఘానికి గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పాత్రపై తాము దర్యాప్తు చేయిస్తుండటంతో.. దానికి సంబంధించిన ఫైలు కోసం సీబీఐ ఈ దాడులు చేసిందని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
డజనుకు పైగా సీబీఐ అధికారులు ఉదయం ఢిల్లీ సచివాలయానికి వచ్చారు. కేజ్రీవాల్ ముఖ్య కార్యదర్శి రాజేంద్రకుమార్‌గుప్తా సహా ఆరుగురిపై నమోదైన అవినీతి కేసుకు సంబంధించి కుమార్ ఆఫీసు, ఇల్లు సహా 14 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. సచివాలయంలోని మూడో అంతస్తులో కేజ్రీవాల్ ఆఫీసు ఉంది. ఆ పక్కనే కుమార్ ఆఫీసు కూడా ఉంది. సీబీఐ అధికారులు తమ అంతస్తులో సోదాలు నిర్వహిస్తుండగానే కేజ్రీ.. తన కార్యాలయంపై సీబీఐ అధికారులు దాడులు చేస్తున్నారని ట్విటర్‌లో తెలిపారు. తాము సీఎం ఆఫీసులో సోదాలు నిర్వహించలేదని, ముఖ్య కార్యదర్శి కుమార్ ఆఫీసులో సోదాలు చేస్తున్నామని సీబీఐ చెప్పగా.. కేజ్రీవాల్ అవి కేవలం సాకులేనంటూ.. సీబీఐ చర్యలు అప్రకటిత అత్యవసర పరిస్థితని అభివర్ణిస్తూ ట్వీట్లు చేశారు.
‘‘సీబీఐ అబద్ధం చెప్తోంది. నా సొంత ఆఫీసులో సోదాలు చేశారు. సీఎం ఆఫీసులో ఫైళ్లను పరిశీలిస్తున్నారు. మోదీ తనకు ఏ ఫైలు కావాలో చెప్పాలి’ అని పేర్కొన్నారు. ఈ సోదాల అనంతరం సీబీఐ అధికారులు గుప్తాను తమ కార్యాలయానికి తీసుకువెళ్లి ప్రశ్నించారు. ఏడు గంటల విచారణ అనంతరం రాత్రి 10:30కు ఆయనను పంపించారు. ఈ కేసులో ఇంటెలిజెంట్ కమ్యునికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ మాజీ ఎండీలు ఎ.కె.దుగ్గల్, జి.కె.నందా, ఆ సంస్థ ప్రస్తుత ఎండీ ఆర్.ఎస్.కౌశిక్, మెసర్స్ ఎండీవర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డెరైక్టర్లు సందీప్‌కుమార్, దినేశ్ కె. గుప్తాలను నిందితులుగా సీబీఐ పేర్కొంది.
కాగా, ‘కేజ్రీవాల్ అవినీతి కేసులో పాత్రధారి అయిన ఒక అధికారిని కాపాడుతుండటం సిగ్గుచేటు. ఆయన కార్యాలయాన్ని సీబీఐ కనీసం అంటుకోనైనా లేదు’ అని బీజేపీ పేర్కొంది. మోదీని విమర్శించిన కేజ్రీ క్షమాపణ చెప్పాలంది. కాగా, ‘‘కేజ్రీవాల్ ఉదయం చెప్పింది (తన ఆఫీసుపై దాడులు)సరి కాదని తెలుస్తోంది. ఆయన ఇప్పుడు చెప్తున్నది (జైట్లీ హయాంలో డీడీసీఏలో అక్రమాలపై విచారణ ఫైలు కోసమే సీబీఐ సోదాలు) చెత్త’ అని జైట్లీ అన్నారు.
జైట్లీ అక్రమాలపై విచారణ ఫైలు కోసం సోదాలు: కేజ్రీవాల్
‘‘మోదీ నన్ను రాజకీయంగా ఎదుర్కొనలేక ఈ పిరికి చర్యలకు దిగారు. మోదీ పిరికిపంద, ఉన్మాది. నేను ఎలాంటి సీబీఐ దాడులకూ భయపడేవాణ్ని కాదు.. మోదీగారూ మీకు చెప్తున్నా, మీరు వేరే వాళ్లను భయపెట్టి ఉండొచ్చు. కానీ అలా భయపడే వారిలో నేను లేను. నా తుదిశ్వాస వరకూ పోరాడుతాను. నన్ను లక్ష్యంగా చేసుకునే ఈ దాడులు చేశారు. నా ముఖ్య కార్యదర్శి రాజేంద్రకుమార్ ఆఫీసులో సోదాలు అనటం సాకు మాత్రమే.
సీబీఐ ఈ రోజు నా ఆఫీసుకు ఎందుకు వచ్చిందో.. వారు వెదుకుతున్న ఫైల్ ఏమిటో నేను చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. అది జైట్లీకి ఉచ్చు బిగిస్తున్న డీడీసీఏ(ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్) ఫైలు. జైట్లీ చాలా ఏళ్లు డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన హయాంలో డీడీసీఏలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై నా ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది. అది నివేదిక ఇచ్చింది. దానిపై విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. సంబంధిత ఫైలు నా ఆఫీసులో ఉంది. నేను హరియాణాలోని సివాన్ గ్రామంలో పుట్టా.. నా మాటలు బాగోలేకపోవచ్చు. కానీ మీ చర్యలు బాగోలేదు. మీ తప్పులకు మీరు దేశానికి క్షమాపణ చెప్పండి.. నా మాటలకు నేను క్షమాపణ చెప్తా’’
- సీబీఐ దాడుల నేపథ్యంలో ట్విటర్‌లోను, మీడియా ఎదుట కేజ్రీవాల్ వ్యాఖ్యలు
కార్యదర్శి ఆఫీసులోనే.. సీఎం ఆఫీసులో కాదు: సీబీఐ
‘‘రాజేంద్రకుమార్ ఆఫీసులోనే సోదాలు నిర్వహిస్తున్నాం. ఢిల్లీలోను, యూపీలోని పలు ప్రాంతాల్లో మొత్తం 14 చోట్ల సోదాలు చేపట్టాం. 2.4 లక్షల నగదు సహా రూ. 16 లక్షలు స్వాధీనం చేసుకున్నాం. కుమార్ ఇంటి నుంచి రూ. 3 లక్షల విలువైన విదేశీ కరెన్సీనీ స్వాధీనం చేసుకున్నాం. 2007-14 మధ్య అధికారాన్ని దుర్వినియోగంతో ఢిల్లీ ప్రభుత్వ విభాగాల నుంచి రూ. 9.5 కోట్ల విలువైన 5 కాంట్రాక్టుల టెండర్లు కొన్ని సంస్థలకు దక్కేలా చూశారాన్న ఆరోపణలపై కుమార్, తదితరులపై కేసు పెట్టాం. ఢిల్లీ డైలాగ్ కమిషన్ మాజీ సభ్య కార్యదర్శి ఆశిష్‌జోషి ఆరోపణలపై ఐపీసీ సెక్షన్లు 120-బి, 13(2), అవినీతి నిరోధక చట్టం 13(1)డి కింద అభియోగాలు నమోదు చేశాం. ఢిల్లీ సీఎం ఆఫీసులో సోదాలు జరిగినట్లు వచ్చిన వార్తలు నిరాధారం.’