
లాలూ చుట్టూ అవినీతి ఉచ్చు
► రైల్వే మంత్రిగా ఉన్నప్పటి అవకతవకలపై తాజాగా సీబీఐ కేసు
► భార్య రబ్రీ, కుమారుడు తేజస్వీతో పాటు కుటుంబ సభ్యులపై కూడా
► పట్నా, రాంచీ, భువనేశ్వర్, గుర్గావ్‌లో ఏకకాలంలో సీబీఐ సోదాలు
న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ చుట్టూ అవినీతి ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. లాలూ, ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌తో పాటు పలువురిపై తాజాగా నమోదైన అవినీతి కేసుకు సంబంధించి సీబీఐ శుక్రవారం 4 నగరాల్లో దాడులు చేసింది. యూపీఏ హయాంలో లాలూ రైల్వేమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అవకతవకలపై నమోదైన కేసులో పట్నాలోని రబ్రీదేవీ ఇంటితో పాటు పట్నా, రాంచీ, గుర్గావ్, భువనేశ్వర్‌లోని 12 ప్రాంతాల్లో సీబీఐ ఏకకాలంలో దాడులు చేసింది.
ఈ నెల 5న నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో లాలూ సన్నిహితుడు ప్రేమ్‌చంద్ గుప్తా భార్య సరళ, సుజాతా హోటల్స్ డైరెక్టర్లు విజయ్ కొచ్చర్, వినయ్ కొచ్చర్, డిలైట్ మార్కెటింగ్ కంపెనీ(ప్రస్తుత లారా ప్రాజెక్ట్స్), ఐఆర్‌సీటీసీ మాజీ ఎండీ పీకే గోయల్ పేర్లు ఉన్నాయి. లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు.. సరళకు చెందిన బినామీ కంపెనీ ద్వారా పట్నాలోని విలువైన భూమిని లంచంగా తీసుకుని రైల్వేలకు సంబంధించిన రాంచీ, పూరీలోని రెండు హోటళ్ల నిర్వహణ బాధ్యతలను సుజాతా హోటల్స్‌కు కట్టబెట్టినట్టు సీబీఐ పేర్కొంది.
2004–14 మధ్య ఈ కుట్ర జరిగిందని సీబీఐ డిప్యూటీ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానా చెప్పారు. సుజాతా హోటల్స్ పట్నాలోని మూడెకరాల విలువైన భూమిని లాలూ కుటుంబానికి చెందిన సరళాగుప్తాకు చెందిన డిలైట్ మార్కెటింగ్‌కు రూ. 1.47 కోట్ల అతి తక్కువ ధరకే కట్టబెట్టిందని ఆరోపించారు. 2010–14 మధ్యలో డిలైట్ కంపెనీ నుంచి రూ. 32.5 కోట్ల విలువైన ఈ భూమిని రూ. 64 లక్షలకే లాలూ కుటుంబ సభ్యుల లారా ప్రాజెక్ట్స్‌కు బదిలీ చేశారని చెప్పారు. దాణా స్కాంలో సీబీఐ కోర్టు ఎదుట లాలూ హాజరైన రోజే ఈ దాడులు జరిగాయి. కాగా, సీబీఐ దాడులు బీజేపీ, మోదీ కుట్ర అని లాలూ ఆరోపించారు. మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా కనుసన్నల్లోనే సోదాలు జరిగాయన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని, ఏ విచారణౖకైనా సిద్ధమని ప్రకటించారు. కేంద్రం ప్రతిపక్ష నేతపై వేధింపులకు పాల్పడుతోందన్నారు.