'అలాంటివి కుదరవు.. కాదంటే జైలుకే'
ముజఫర్ నగర్: ఇకపై ఎలాంటి వేడుకల్లోనైనా గాల్లోకి కాల్పులు జరపడం ఆపేయాలని లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఉత్తరప్రదేశ్ లోని షామ్లీ జిల్లా పోలీసులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి కాల్పుల కారణంగా గత నెలలో ఓ ఎనిమిదేళ్ల బాలుడు ప్రాణాలుకోల్పోయిన నేపథ్యంలో మున్ముందు అలాంటివాటికి తావు లేకుండా చేసేందుకు ఈ ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరప్రదేశ్లో ఎలాంటి వేడుక జరిగిన సామూహికంగా సంబరాలు చేసుకుంటూ గాల్లోకి కాల్పులు జరపడం అక్కడి వారు చేసే సర్వసాధరణమైన పని.
అయితే, ఇప్పటి వరకు పోలీసులు పెద్దగా పట్టించుకోకుండా ఉన్నప్పటికీ మొన్న బాలుడు చనిపోవడంతో ఆ విషయం కాస్త దేశ వ్యాప్తంగా ప్రచారమై శాంతిభద్రతలను పలువురు ప్రశ్నించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కూడా సీరియస్ గా స్పందించారు. దీంతో ఛీవాట్లు తిన్న పోలీసు ఉన్నతాధికారులు ఘటన చోటుచేసుకున్న షామ్లీ జిల్లాలో తుపాకులను ఎలా పడితే అలా ముఖ్యంగా గాల్లోకి కాల్పులు జరపడాన్ని రద్దు చేస్తూ నిషేధాజ్ఞలు జారీ చేశారు.