రాజ్యసభకు ప్రముఖుల నామినేషన్లు
దాఖలు చేసినవారిలో వెంకయ్య, సిబల్, జైరాం, జెఠ్మలానీ
న్యూఢిల్లీ: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో భాగంగా సోమవారం పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతిలు వివిధ పార్టీల తరఫున నామినేషన్ పత్రాలు సమర్పించారు. 15 రాష్ట్రాల్లోని 57 రాజ్యసభ స్థానాలకు జూన్ 11న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ దాఖలు చేసిన ప్రముఖుల్లో కేంద్ర మంత్రులు బీరేంద్ర సింగ్, ముఖ్తార్ అబ్బాస్ నక్వీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరాం రమేష్, కపిల్ సిబల్, అంబికా సోనీలు ఉన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ఓం ప్రకాశ్ మాథుర్, రామ్‌కుమార్ వర్మ, హర్షవర్ధన్ సింగ్‌లు బీజేపీ తరఫున రాజస్థాన్ నుంచి నామినేషన్ వేశారు.
వీరిలో హర్షవర్ధన్ రాజస్థాన్ మాజీ స్పీకర్ లక్ష్మణ్ సింగ్ మనువడు కాగా, వర్మ ఆర్బీఐ మాజీ ఉన్నతాధికారి. జెఠ్మలానీ, మీసా భారతి, జేడీయూ నేత శరద్ యాదవ్, రామచంద్ర ప్రసాద్ సింగ్‌లు ఆర్జేడీ-జేడీయూ కూటమి తరఫున బిహార్ నుంచి నామినేషన్లు సమర్పించారు. కూటమి తరఫున పోటీ చేస్తున్న అందరూ విజయం సాధిస్తారని లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. కర్నాటక నుంచి కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరాం రమేష్, ఆస్కార్ ఫెర్నాండెజ్‌తో పాటు కేసీ రామమూర్తి(కాంగ్రెస్), బీఎం ఫరూక్(జేడీఎస్)లు నామినేషన్ వేశారు. యూపీ నుంచి కపిల్ సిబల్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఛండీగఢ్‌లో బీజేపీ తరఫున గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేందర్ సింగ్(హరియాణా), కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అంబికా సోనీ(పంజాబ్), జార్ఖండ్ నుంచి కేంద్ర మంత్రి నక్వీ(బీజేపీ), ఒడిషా నుంచి బీజేడీ తరఫున ప్రసన్న ఆచార్య, బిష్ణు దాస్, ఎన్.భాస్కర్ రావులు నామినేషన్ దాఖలు చేశారు. జూన్ 1న నామినేషన్లు పరిశీలిస్తారు. ఉపసంహరణకు చివరితేది జూన్ 3. 55 మంది సభ్యులు జూన్, ఆగస్టు మధ్యలో పదవీ విర మణ చేస్తుండడంతో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
ఏపీ నుంచి సురేశ్ ప్రభు
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభకు మరో ఆరుగురు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు టీడీపీ సహకారంతో ఏపీ నుంచి రాజ్యసభకు పోటీ చేయనున్నారు. సోమవారం విడుదల చేసిన రెండో విడత జాబితాలో సురేశ్‌ప్రభుతో పాటు మధ్యప్రదేశ్ నుంచి ఎం.జె.అక్బర్, మహారాష్ట్ర నుంచి వినయ్ సహస్రబుద్దే, డాక్టర్ వికాస్ మహాత్మే, యూపీ నుంచి శివ్ ప్రతాప్ శుక్లా, జార్ఖండ్ నుంచి మహేష్ పొద్దార్‌లు ఉన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ పేరు వినిపించినా అవకాశం దక్కలేదు. బ్రాహ్మణ వర్గానికి చెందిన శుక్లా ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన సీనియర్ నేత. వచ్చే ఏడాది యూపీ ఎన్నికల నేపథ్యంలో ఆయనకు చోటు కల్పించారు.