సాక్షి, ముంబై : సెల్‌ఫోన్ అధికంగా వాడటం వల్ల కళ్లు దెబ్బతింటాయి.. మానసినక రుగ్మతలకు దారితీస్తుంది.. ఇవి అందరికీ తెలిసిన విషయాలే! అయితే సెల్‌ఫోన్‌లను ఎక్కువసేపు వాడటం వల్ల దానినుంచి విడుదలయ్యే బ్లూలైట్ కారణంగా చర్మం దెబ్బతింటుందని చర్మవైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. తద్వారా త్వరగా వయసు మీదపడిన ఛాయలు వచ్చే అవకాశం ఉందంటున్నారు ముంబైకి చెందిన ప్రముఖ డెర్మటాలజిస్టు డా. షెఫాలి ట్రాసీ నెరూర్‌కర్. ఎవరైతే గంటల తరబడి సెల్‌ఫోన్‌లు వాడుతుంటారో వారు పిగ్మెంటేషన్, ఇన్‌ఫ్లమేషన్, చర్మ బలహీనపడటం వంటి వ్యాధుల భారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
సెల్‌ఫోన్లు మాత్రమే కాకుండా కంప్యూటర్ తెరలనుంచి విడుదలయ్యే బ్లూలైట్ కారణంగా మన చర్మానికి రక్షణగా నిలిచే కొల్లజన్ అనే ప్రోటీన్ ఉత్పత్తి తగ్గిపోతుందని తెలిపారు. బ్లూలైట్ కారణంగా చర్మంలోని కణాలు దెబ్బతిని త్వరగా వయసు మళ్లిన వారిలా కనపడేలా చేస్తాయన్నారు. చర్మంపై ముడతలు, నల్లటి వలయాలు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరి రాత్రుళ్లు ఎక్కువగా సెల్‌ఫోన్లు ఉపయోగించే వారి నిద్రకు అటంకాలు ఏర్పటం మూలాన మానసిక, శారీరక సమస్యలు ఉత్పన్నమవుతాయని వెల్లడించారు. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే తగిన విశ్రాంతి అవసరమని పేర్కొన్నారు. అందంగా, ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు సెల్‌ఫోన్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని సలహా ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment