నిత్యావసరాల ధరల నియంత్రణ కోసం రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
రాష్ట్రాలకు అందుబాటులోకి మరో 50 లక్షల టన్నుల బియ్యం
న్యూఢిల్లీ: దేశంలో ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్టానికి చేరుకోవడంతో (మేలో 6.01 శాతం) నిత్యావసరాల ధరల కట్టడికి కేంద్రం మంగళవారం పలు చర్యలు చేపట్టింది. నిత్యావసరాలను అక్రమంగా నిల్వ ఉంచే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. అలాగే పండ్లు, కూరగాయల ధరలను నియంత్రించేందుకు వీలుగా వాటిని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీల జాబితా నుంచి తొలగించాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల రైతులు తమ ఉత్పత్తులను నేరుగా బహిరంగ మార్కెట్‌లో విక్రయించుకునే అవకాశం లభిస్తుందని పేర్కొంది.
మరోవైపు ఉల్లి ఎగుమతులను నియంత్రించేందుకు వీలుగా వాటి కనీస ఎగుమతి ధర (ఎంఈపీ)ను టన్నుకు 300 డాలర్లుగా (సుమారు రూ. 18 వేలు) నిర్ణయించింది. ఆలుగడ్డల ఎగుమతులపైనా ఇదే రకమైన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖకు సూచించింది. బియ్యం ధరలను తగ్గించేందుకు మరో 50 లక్షల టన్నుల బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో ఏపీఎల్ ధర ప్రకారం కిలోకు రూ. 8.30 చొప్పున విక్రయించేందుకు రాష్ట్రాలకు విడుదల చేయాలని నిర్ణయించింది. ద్రవ్యోల్బణం కట్టడిపై వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్, ఆహార మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్, వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్, ప్రధాని మోడీ ప్రిన్సిపల్ కార్యదర్శి నృపేంద్ర మిశ్రా తదితరులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. అలాగే స్థానిక డిమాండ్‌కు అనుగుణంగా తృణధాన్యాలు, వంటనూనెలను అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని నేరుగా దిగుమతి చేసుకునేందుకు అనుమతించామన్నారు. 22 నిత్యావసర పదార్థాల ధరలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని జైట్లీ చెప్పారు.
అక్రమ నిల్వలపై ఉక్కుపాదం
Published Wed, Jun 18 2014 12:55 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 AM
Advertisement
Advertisement