స్పెషల్ ట్రీట్‌మెంట్.. ఇక చాలా కష్టం!
సాక్షి, న్యూఢిల్లీ: వీఐపీ ట్రీట్‌మెంట్‌కు ముగింపు పలకాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ‍్యంలో మరో అడుగు ముందుకు వేసింది. వారి భద్రతా సిబ్బందిని గణనీయంగా తగ్గించేందుకు కేంద్ర హోంశాఖ ప్రణాళికను సిద్ధం చేస్తోంది.
యూపీఏ హయాంలో 350 మందికి వీపీపీ ట్రీట్‌మెంట్ కింద ప్రత్యేక భద్రతను కల్పించగా, ఇప్పుడు 457 మందికి ఆ సౌకర్యాన్ని కలిగిస్తున్నారు. ‘నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్‌ఎస్‌జీ) తోపాటు పారామిలిటరీ దళాలు రెండూ కూడా వీరికి భద్రత కల్పిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలులోకి వస్తే గనుక చాలా మంది ఎన్‌ఎస్‌జీ సిబ్బందిని వదలుకోవాల్సి ఉంటుంది’ అని ఓ ఉన్నత అధికారి వ్యాఖ్యానించారు.
కేవలం రాష్ట్రాలకు మాత్రమే పరిమితమయ్యే నేతలకు ముందుగా ఈ నిర్ణయం అమలు చేయబోతున్నారు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, డీఎంకే సీనియర్ నేత కరుణానిధిలతోపాటు బీజేపీకి చెందిన ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌లకు భద్రతా సిబ్బందిలో కొత పడే ఆస్కారం కనిపిస్తోంది. ప్రస్తుతం వీరందరికి జ ఫ్లస్ సెక్యూరిటీ కింద 50 మందిని కేటాయించగా, వాళ్లు బయటకు వెళ్లే సమయాలల్లో 35 నుంచి 40 మంది ఎప్పుడూ వెంట ఉంటారు. గత ప్రభుత్వ హయాంలో ఈ సంఖ్య కేవలం 26గా మాత్రమే ఉండేది.
అయితే భద్రతా సిబ్బందిని తగ్గించటం.. పెంచటం అనే వ్యవహారంపై పూర్తిగా రాజకీయ స్థితిగతుల మీదే ఆధారపడి ఉంటుందని ఓ అధికారి వ్యాఖ్యానిస్తున్నారు. ఉదాహరణకు.. అస్సాం సీఎంగా తరుణ్ గొగోయ్ ఉన్న సమయంలో బ్లాక్ క్యాట్ కమాండోలను ఉపసంహరించుకుంటూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. సర్బనందా సోనోవల్ బీజేపీ తరపున ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక వెంటనే తిరిగి అదే సెక్యురిటీని కేటాయించింది. ఇదే విషయాన్ని ఆ అధికారి ప్రస్తావించారు. గతంలో తమ సిబ్బందిపై నేతలు దురుసుగా వ్యవహరించిన దాఖలాలు కూడా అనేకం ఉన్నాయని ఆయన అంటున్నారు.
నేతలకు పొంచి ఉన్న ముప్పు ఆధారంగా ఎక్స్ నుంచి జెడ్ కేటగిరిగా విభజించి వారికి భద్రతా సిబ్బందిని నియమిస్తుంటారు. వై కేటగిరీల్లో ఉన్నవారికి 11 మంది సిబ్బందిని, జెడ్ కేటగిరీల్లో ఉన్న వారికి 30 మంది సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తోంది. బాబా రాందేవ్, మాతా అమృతానందమయి, మహంత్ నృత్యగోపాల్ దాస్, సాక్షి మహరాజ్, ముకేష్ అంబానీ-సతీమణి నీతా అంబాని ప్రస్తుతం వీఐపీ ట్రీట్ మెంట్ అందుకుంటుండగా.. ఉత్తర ప్రదేశ్ నుంచే ఎక్కువ మంది ఈ లిస్ట్‌లో ఉండటం విశేషం.