సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో రెడ్ జోన్ కేటగిరీ జిల్లాలు తగ్గాయి. గత వారం కేంద్ర ఆరోగ్య శాఖ 9 జిల్లాలను రెడ్ జోన్లుగా ప్రకటించగా తాజాగా 6 జిల్లాలను మాత్రమే రెడ్ జోన్లుగా ప్రకటించింది. మిగిలిన జిల్లాల్లో 18 ఆరెంజ్ జోన్‌లో, 9 గ్రీన్ జోన్‌లో ఉన్నాయి. తాజా వర్గీకరణ మే 3 నుంచి అమల్లోకి వస్తుంది. దేశవ్యాప్తంగా 130 జిల్లాలను రెడ్ జోన్‌లో, 284 జిల్లాలను ఆరెంజ్ జోన్‌లో, 319 జిల్లాలు గ్రీన్ జోన్‌లో ఉన్నట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. అంతకుముందు వారం దేశవ్యాప్తంగా 170 రెడ్ జోన్‌లో, 207 ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయి. వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్య శాఖ కార్యదర్శులతో కేంద్ర కేబినెట్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన అనంతరం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుదాన్ జోన్ల వర్గీకరణపై తాజా ఉత్తర్వులను రాష్ట్రాలకు పంపారు.
మారిన ప్రాతిపదిక...: గత వారం కేవలం కేసుల (క్యుములేటివ్) సంఖ్య, కేసులు రెట్టింపు అయ్యేందుకు పడుతున్న కాలాన్నిబట్టి జోన్లను వర్గీకరించారు. అయితే తాజాగా ఆ ప్రాతిపదికను మరింత విస్తృతం చేసినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. పాజిటివ్ కేసుల నుంచి కోలుకున్న వారి సంఖ్య పెరగడంతో ప్రాతిపదికన విస్తృతం చేసినట్టు తెలిపింది. కేసుల సంఖ్య, డబ్లింగ్ రేటు, టెస్టుల పరిధి, సర్వైలెన్స్ వంటి అంశాల ప్రాతిపదికన జిల్లాలను వర్గీకరించినట్టు తెలిపింది. ఇప్పటివరకు కరోనా కేసులు లేని వాటిని, గడిచిన 21 రోజుల్లో కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కాని జిల్లాలను గ్రీన్ జోన్‌లోకి పరిగణనలోకి తీసుకోనున్నట్టు తెలిపింది. చదవండి: భారత్ కేంద్రంగా నూతన ప్రపంచం
వారం వారం మారుతుంది...
కొన్ని జిల్లాలు రెడ్ జోన్‌లోకి చేర్చడాన్ని రాష్ట్రాలు ప్రశ్నించాయని, అయితే ఈ జాబితా చలనశీలత కలిగినదని, ప్రతి వారం ఈ జాబితా మారుతుందని ఆరోగ్య శాఖ కార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. క్షేత్రస్థాయి ఫీడ్ బ్యాక్ ఆధారంగా, రాష్ట్రస్థాయిలో అదనపు విశ్లేషణ ఆధారంగా, రాష్ట్రాలు మరిన్ని రెడ్ జోన్లను, ఆరెంజ్ జోన్లను నిర్దేశించవచ్చని పేర్కొన్నారు. అయితే కేంద్రం ఇచ్చిన రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ జిల్లాల జోనల్ వర్గీకరణలో రాష్ట్రాలు సడలింపు చేయరాదని పేర్కొన్నారు. జిల్లాల్లో ఒకటి కంటే ఎక్కువగా మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నప్పుడు కార్పొరేషన్లను, జిల్లాలోని మిగిలిన ప్రాంతాన్ని వేర్వేరు యూనిట్లుగా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
ఒక యూనిట్‌లో 21 రోజులపాటు కేసులు లేనిపక్షంలో ఆ యూనిట్ వరకు జోన్ వర్గీకరణను మార్చవచ్చన్నారు. అందుకు సంబంధించి పలు మార్గదర్శకాలు జారీ చేశారు. కాగా, కేంద్రం ప్రకటించినట్లుగా ఆయా జిల్లాలను పూర్తిస్థాయిలో రెడ్‌జోన్లుగా ఉంచాలా లేక అక్కడ కూడా కంటైన్మెంట్ జోన్ల ప్రకారమే నడుచుకోవాలా అన్న దానిపై రాష్ట్ర అధికారులు శనివారం నిర్ణయం తీసుకోనున్నారు. కరీంనగర్ ప్లాన్‌ను అమలు చేయడం వల్లే ఇప్పటివరకు విజయవంతంగా వైరస్‌ను నియంత్రణలోకి తీసుకురాగలిగామని అధికారులు చెబుతున్నారు. ఆ ప్రకారమే నిర్ణయం తీసుకుంటామంటున్నారు. చదవండి: చైనాపై మళ్లీ కారాలు మిరియాలు
రెడ్ జోన్‌లో..
1. హైదరాబాద్
2. సూర్యాపేట
3. రంగారెడ్డి
4. మేడ్చల్
5. వికారాబాద్
6. వరంగల్ అర్బన్
గ్రీన్ జోన్‌లో..
1. పెద్దపల్లి
2. నాగర్‌కర్నూల్
3. ములుగు
4. భద్రాద్రి కొత్తగూడెం
5. మహబూబాబాద్
6. సిద్దిపేట
7. వరంగల్ రూరల్
8. వనపర్తి
9. యాదాద్రి భువనగిరి
ఆరెంజ్ జోన్‌లో..
1. నిజామాబాద్
2. గద్వాల
3. నిర్మల్
4. నల్లగొండ
5. ఆదిలాబాద్
6. సంగారెడ్డి
7. కామారెడ్డి
8. ఆసిఫాబాద్
9. కరీంనగర్
10. ఖమ్మం
11. మహబూబ్‌నగర్
12. జగిత్యాల
13. రాజన్న సిరిసిల్ల
14. భూపాల్‌పల్లి
15. మెదక్
16. జనగాం
17. నారాయణ్‌పేట్
18. మంచిర్యాల
Comments
Please login to add a commentAdd a comment