ఆంక్షలతో ఎవరికి నష్టం? ఎవరికి కష్టం?! | Centre Puts Ban-Like Restrictions On Cattle Slaughter Across India | Sakshi
Sakshi News home page

ఆంక్షలతో ఎవరికి నష్టం? ఎవరికి కష్టం?!

Published Fri, May 26 2017 11:35 PM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM

ఆంక్షలతో ఎవరికి నష్టం? ఎవరికి కష్టం?! - Sakshi

ఆంక్షలతో ఎవరికి నష్టం? ఎవరికి కష్టం?!

దేశవ్యాప్తంగా పశువులను వధించడం కోసం విక్రయించడాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించడం ఆర్థికంగా, సామాజికంగా ప్రతికూల ప్రభావాలు చూపనుంది. ప్రపంచంలో పశుమాంస ఎగుమతి దేశాల్లో మొదటి స్థానంలో ఉన్న భారత దేశంలో ఈ రంగం మీద ఆధారపడి ఉన్న 4 కోట్ల మంది తాజా ఆంక్షలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పశు మాంసం రంగానికి సంబంధించిన ముఖ్యాంశాలివీ...

వధ నిషేధం వీటిపైన: ఎద్దులు, దున్నపోతులు, ఆవులు, గేదెలు, ఒంటెలు, కోడెలు, దూడలు తదితర పశువులు వేటినీ మాంసం కోసం వధించడానికి లేదా మతావసరాల కోసం వధించడానికి విక్రయించడాన్ని కేంద్రం తాజాగా నిషేధించింది.  

4 కోట్ల మందికి ఉపాధి: పశు మాంసం రంగంలో దేశంలో నాలుగు కోట్ల మంది ఉపాధి పొందుతున్నారని అంచనా. వీరిలో 90 శాతం మంది వరకూ అసంఘటిత రంగంలోనే ఉన్నారు. పశువుల వ్యాపారం, క్రయవిక్రయాలు, మాంసం దుకాణాలు, చర్మం శుద్ధి, ఎముకలు తదితరాల శుద్ధి వంటి రంగాల్లోని వారి ఉపాధిపై.. వధించడం కోసం పశువుల విక్రయంపై తాజా ఆంక్షలు గొడ్డలి పెట్టు అవుతాయని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.

అలాగే.. పశుపోషణ వృత్తిగా సాగించే వారికి, రైతులకు కూడా కష్టాలు పెరుగుతాయని.. పాల కోసమో, మాంసం కోసమో కాకుండా పశువులను పోషించడం వారికి పెను భారంగా మారుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యవసాయ అవసరాల కోసం జరిపే క్రయవిక్రయాలకు కూడా అనేక రుజువులు చూపాల్సి రావడం, పత్రాలను తయారు చేసుకోవడం వంటివి నిరక్షరాస్యులైన అత్యధిక రైతాంగాన్ని ఇక్కట్ల పాలు చేస్తుందని విమర్శిస్తున్నారు.

ఎగుమతుల్లో నంబర్ 1: ప్రపంచంలో అతి పెద్ద పశు మాంసం ఎగుమతి దేశం భారతదేశమే. 2013లో బ్రెజిల్‌పెద్ద ఎగుమతిదారుగా ఉండగా.. దానిని భారత్‌అధిగమించింది. ఆవు మాంసం కన్నా గేదె మాంసం చౌక కాబట్టి దేశం నుంచి ఎగుమతి చేసే పశుమాంసంలో గేదె/దున్న మాంసానిదే సింహభాగం.

బాస్మతి బియ్యం ఎగుమతుల కన్నా బీఫ్‌/బఫెలో ఎగుమతుల ద్వారానే దేశానికి ఎక్కువ విదేశీ మారకద్రవ్యం లభిస్తోంది. 201516 ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగం లెక్కల ప్రకారం దేశం నుంచి ఎగుమతయ్యే వ్యవసాయ, అనుబంధ ఉత్పత్తుల్లో బఫెలో మాంసం ఎగుమతి 23 శాతంగా ఉంటే.. ఆ తర్వాతి స్థానాల్లో బాస్మతి బియ్యం (21.86 శాతం), బాస్మతేతర బియ్యం (17.25 శాతం) ఉన్నాయి. భారత్‌నుంచి పశు మాంసాన్ని అధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో వియత్నాం, మలేసియా, సౌదీ అరేబియా, ఈజిప్టు దేశాలు కొన్ని.

ఉత్పత్తిలో నంబర్ 4: ప్రపంచంలో బీఫ్/బఫెలో మాంస పరిశ్రమలో అగ్రస్థానం అమెరికాదే. ప్రపంచ బీఫ్ ఉత్పత్తిలోనూ, వినియోగంలోనూ 20 శాతం అగ్రరాజ్యానిదే. బీఫ్/బఫెలో మాంస ఉత్పత్తిలో ప్రపంచంలో నాలుగో పెద్ద దేశం భారత్. మొదటి స్థానంలో బ్రెజిల్, రెండో స్థానంలో యూరోపియన్‌యూనియన్, మూడో స్థానంలో చైనా ఉన్నాయి. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే బీఫ్/బఫెలో మాంసంలో భారతదేశం వాటా 7 శాతం. దేశంలో ఉత్పత్తి అయ్యే మాంసంలో బీఫ్/బఫెలో మాంసానిది రెండో స్థానం. అందులో అత్యధిక వాటా బఫెలో మాంసానిదే.

వినియోగంలో నంబర్ 5: ప్రపంచంలో బీఫ్/బఫెలో అధికంగా తినే దేశాల్లో భారత్ ఐదో స్థానంలో ఉంది. మొత్తం ప్రపంచ వినియోగంలో 4 శాతం మాత్రమే భారత్‌లో ఉంది. అయితే.. ఇతర దేశాల్లో బీఫ్ వినియోగం అధికంగా ఉంటే.. భారత్‌లో బఫెలో మాంసం వినియోగం అధికం. ఈ మాంస వినియోగం గత కొన్నేళ్లుగా పెరుగుతోంది కూడా.

ప్రతి 13 మంది భారతీయుల్లో ఒకరు బీఫ్‌లేదా గేదె మాంసం తింటున్నారని జాతీయ నమూనా సర్వే కార్యాలయం (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) చెప్తోంది. జనాభాలో ఎక్కువగా బీఫ్‌/బఫెలో మాంసం తినేది ముస్లిం మతస్తులు. దాదాపు 40 శాతం మంది భారతీయ ముస్లింలు బీఫ్‌తింటారు. క్రైస్తవుల్లో 26 శాతం మందికి పైగా, హిందువుల్లో రెండు శాతం కన్నా కొంచెం తక్కువ మంది బీఫ్‌తినేవారు ఉన్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే మేఘాలయ, కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌లలో బీఫ్‌వినియోగం అత్యధికం.
.
మతాల వారీగా బీఫ్‌/బఫెలో మాంస వినియోగం ఇలా...
మతం              జనాభా
హిందువులు    12.56 కోట్లు
ముస్లింలు        6.349 కోట్లు
క్రైస్తవులు         65.4 లక్షలు
ఇతరులు         8.9 లక్షలు


దేశపు పశు మాంసం ఎగుమతులు ఇలా...
201617 (ఏప్రిల్ – జనవరి) రూ. 22,074 కోట్లు
201516                         రూ. 27,610 కోట్లు
201415                         రూ. 30,201 కోట్లు
201314                         రూ. 27,720 కోట్లు
మాంసం ఎగుమతి కంపెనీలు: 81


దేశంలో ఉత్తత్తి అయ్యే మాంసంలో ఏ పశువులది ఎంత శాతం?
పౌల్ట్రీ (కోళ్లు తదితర పక్షలు): 45%
బఫెలో: 19%
మేకలు: 16%
పందులు: 8%
గొర్రెలు: 7%
ఆవులు/ఎడ్లు: 5%


– సాక్షి నాలెడ్జ్‌సెంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement