'ఆప్ నిధులపై విచారణ జరిపించండి'
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి విదేశాల్లో ఎవరి నుంచి నిధులు వస్తున్నాయో విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆప్ రెబల్ లీడర్ కపిల్ మిశ్రా చెప్పిన విషయాలన్నింటిపై పూర్తి స్ధాయి దర్యాప్తు జరపాలని కోరింది. దేశ విద్రోహ శక్తుల నుంచి ఆప్‌కు నిధులు ఏవైనా వస్తున్నాయా? అనే కోణంలో కూడా దర్యాప్తు జరపాలని పేర్కొంది.
ఆప్ అధ్యక్షుడు ఆరవింద్ కేజ్రీవాల్‌పై కపిల్ మిశ్రా లెక్కలేనన్ని ఆరోపణలు చేశారని కాంగ్రెస్ నాయకుడు మాకెన్ అన్నారు. కపిల్‌తో పాటు నీల్ కూడా గతంలో కేజ్రీపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారని గుర్తు చేశారు. అయితే, పోలీసులు ఇంతవరకూ కేజ్రీపై ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు.
వేర్పాటువాదుల నుంచి ఆప్ నిధులను తీసుకుంటోందని గతంలో కాంగ్రెస్ లీడర్ ఆనంద్ శర్మ ఆరోపించిన విషయం తెలిసిందే. ఆప్‌కు విదేశాల నుంచి వస్తున్న నిధులపై విచారణ జరిపించాలని మాకెన్ డిమాండ్ చేశారు. ఏయే గ్రూప్‌ల నుంచి ఆప్‌కు నిధులు అందుతున్నాయన్న విషయాన్ని బయటపెట్టాలని కూడా కోరారు.