
రద్దయిన నోట్లుంటే జరిమానా!
డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంలో భాగంగా తెచ్చిన లక్కీ డ్రా పథకానికి సంబంధించి 15 వేల మంది విజేతలను ఎన్‌పీసీఐ (భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్) ఎంపిక చేసింది.
ఆర్డినెన్స్ యోచనలో కేంద్రం
న్యూఢిల్లీ: డిసెంబర్ 30 తర్వాత కూడా రద్దయిన పాత పెద్ద నోట్లను తమ వద్దే అట్టిపెట్టుకున్న వారిపై జరిమానా విధించాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం ఆర్డినెన్స్ తేవాలని కేంద్రం యోచిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ విషయమై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. డిసెంబర్ 30 తర్వాత చెరో పది లేదా అంతకంటే ఎక్కువ రూ.500 నోట్లు, రూ.1000 నోట్లు తమ వద్ద ఉంచేసుకున్న వారిపై జరిమానా విధించాలని ప్రభుత్వం భావిస్తోందని సంబంధిత వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. ఎక్కువగా నోట్లు అట్టిపెట్టుకున్న వారిపై రూ.50వేల జరిమానా లేదా దాచుకున్న నగదువిలువకు ఐదురెట్లు జరిమానా విధించే వీలుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతాపార్టీ 1978లో రూ.1,000, రూ.5,000, రూ.10,000 నోట్లను రద్దుచేసినపుడు సైతం ఇలాంటి ఆర్డినెన్స్‌నే జారీచేసింది.
‘లక్కీ డ్రా’ విజేతలు 15 వేలు
డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంలో భాగంగా తెచ్చిన లక్కీ డ్రా పథకానికి సంబంధించి 15 వేల మంది విజేతలను ఎన్‌పీసీఐ (భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్) ఎంపిక చేసింది. నవంబర్ 9 నుంచి డిసెంబర్ 21 మధ్య లక్కీ డ్రా కోసం ఎన్‌పీసీఐ నిర్దేశించిన పద్ధతుల్లో 8 కోట్ల లావాదేవీలు జరగ్గా వాటి నుంచి 15 వేల మంది విజేతలను ఎంపిక చేశారు.
వీరందరి బ్యాంకు ఖాతాల్లో మరో 24 గంటల్లో రూ.1,000 జమ చేస్తామని ఎన్‌పీసీఐ తెలిపింది. రూపే కార్డు, యూఎస్‌ఎస్‌డీ, యూపీఐ, ఏఈపీఎస్ విధానాల్లో చెల్లింపులు చేసే వినియోగదారులు లక్కీ డ్రాలో పాల్గొనడానికి అర్హులని ఎన్‌పీసీఐ గతంలో ప్రకటించింది. విజేతల జాబితాను www. digidhanlucky. mygov. in వెబ్‌సైట్‌లో చూడవచ్చు.