‘చలే సాథ్ సాథ్...’
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామతో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ సుదీర్ఘ చర్చలు, పలు ఒప్పందాలు, నిర్ణయాల అనంతరం.. అమెరికా, భారత ప్రభుత్వాలు ఇరు దేశాల సంబంధాలను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు తీసుకున్న నిర్ణయాలను పేర్కొంటూ ‘స్నేహ ప్రకటన’ పేరుతో ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ‘చలే సాత్ సాత్: మనం కలిసి ముందుకెళదాం...’ అనే శీర్షికతో విడుదల చేసిన ఆ ప్రకటనలోని ముఖ్యాంశాలివీ...
భారత్, అమెరికాలు మన రెండు గొప్ప ప్రజాస్వామ్యాల మధ్య సన్నిహిత సంబంధాలను ప్రతిబింబిస్తూ.. తమ దీర్ఘ కాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఒక స్నేహ ప్రకటన ద్వారా ఉన్నతృస్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించాయి.
ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేసేందుకు చేపట్టే వేసే ప్రతి అడుగూ.. అంతర్జాతీయ భద్రత, ప్రాంతీయ, ప్రపంచ శాంతికి ఆకృతినిచ్చే దిశగా వేసే అడుగు.
ఈ స్నేహ ప్రకటన.. మరింత ఉత్తమమైన ప్రపంచం కోసం మన ప్రభుత్వాలను, ప్రజలను మరింత సన్నిహితం చేసే ఉన్నత స్థాయి విశ్వాసం ప్రకటిస్తోంది.
ఇరు దేశాలూ తరచుగా ఎక్కువసార్లు శిఖరాగ్ర సదస్సులు నిర్వహించాలని నిర్ణయించాయి. వ్యూహాత్మక చర్చలకు వ్యూహాత్మక, వాణిజ్య చర్చలుగా ఉన్నతి కల్పించాలని నిర్ణయించాయి. ఈ చర్చల్లోని వ్యూహాత్మక అంశాలకు భౠరత విదేశీ వ్యవహారాల మంత్రి, అమెరికా విదేశాంగ మంత్రులు నేతృత్వం వహిస్తారు. చర్చల్లోని వాణిజ్య అంశాలకు భారత అమెరికా వాణిజ్య మంత్రులు సారథ్యం వహిస్తారు.
వ్యూహాత్మక ప్రాధాన్యత గల ప్రాజెక్టులపై సంయుక్త సంస్థలను (జాయింట్ వెంచర్లు) అభివృద్ధి చేయటంలో సహకరించుకోవాలని ఇరు దేశాలూ నిర్ణయించాయి.
అర్థవంతమైన భద్రత, సమర్థవంతమైన ఉగ్రవాద వ్యతిరేక సహకారం అందించుకోవాలని నిర్ణయించాయి. బహుముఖ వేదికలపై తరచుగా సంప్రదింపులు జరుపుకోవాలని నిర్ణయించాయి.