‘సయోధ్య’తోనే ముందుకెళ్లాలి
విభజనపై కేంద్రానికి చంద్రబాబు డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల వారి మధ్య సయోధ్య చేశాకే ముందుకెళ్లాలని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సయోధ్య ఏర్పాటు చేసే బాధ్యతను తీసుకోవాలని రాజకీయ పార్టీలకూ విజ్ఞప్తి చేశారు. జేడీ(యూ) అధినేత శరద్‌యాదవ్‌తో ఆదివారం రాత్రి భేటీ అనంతరం, అంతకుముందు మధ్యాహ్నం ఢిల్లీ విమానాశ్రయంలో బాబు మీడియాతో మాట్లాడారు.
‘‘తెలంగాణ ఇవ్వాలంటే సీమాంధ్ర ప్రజలను ఒప్పించాలి. సమైక్యంగా ఉంచాలంటే తెలంగాణ వారిని ఒప్పించాలి. ఇవేవీ చేయలేదు’’ అని పునరుద్ఘాటించారు. ఇరు ప్రాంతాల వారిని ఒకటికి నాలుగుసార్లు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని చూడాలన్నారు. దేశ సమస్యపై నిర్ణయం తీసుకోడానికి సోనియా, ఐదుగురు మంత్రులు (జీవోఎం) ఎవరని ప్రశ్నించారు. రాజ్యాంగం, సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా బిల్లు పెట్టే అధికారం లేదన్నారు. తెలివిలేని సోనియా వచ్చి దేశాన్ని నాశనం చేస్తోందని ధ్వజమెత్తారు. టీడీపీ ఎంపీలు పరస్పరం గొడవలు చేసుకోవడంపై ప్రశ్నించగా, ‘‘ప్రజల మధ్యే కాదు... పార్టీల మధ్య కూడా సోనియా విషబీజాలు నాటింది’’ అని బదులిచ్చారు. ఎంపీల సస్పెన్షన్ విషయంలో ఆమె చెప్పినట్లే స్పీకర్ వింటున్నారని విమర్శించారు. సమైక్యాంధ్ర ధర్నాలో పాల్గొంటారా? అన్న ప్రశ్నకు... ‘‘నేను ఈ పక్క.. ఆ పక్కా కాదు. కొందరికి ఇష్టం ఉండవచ్చు. ఇష్టం ఉండకపోవచ్చు. చాలా నిర్మోహమాటంగా మాట్లాడుతున్నా. సమస్యను పద్ధతి ప్రకారం పరిష్కారించాలి. సమన్యాయం చేయాలి’’ అని బదులిచ్చారు.
మోడీ, ములాయం, శరద్‌యాదవ్‌లతో భేటీలు...
చండీగఢ్‌లో ఆదివారం నిర్వహించిన కిసాన్ ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబు అక్కడి విమానాశ్రయంలో గుజరాత్ సీఎం, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో దాదాపు 20 నిమిషాల పాటు ఏకాంతంగా చర్చలు జరిపారు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లును ఎట్టిపరిస్థితుల్లోనూ సమర్థించకుండా బీజేపీ అధినాయకత్వంపై ఒత్తిడి తేవాలని సూచించినట్టు సమాచారం. రానున్న ఎన్నికల్లో బీజేపీతో పొత్తు విషయాలనూ చర్చించినట్టు తెలిసింది. అనంతరం ఢిల్లీకి వచ్చిన బాబు విమానాశ్రయంలో ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్‌తో భేటీ అయ్యారు. తర్వాత రాత్రి 7.30 గంటలకు జేడీ(యూ) అధినేత శరద్‌యాదవ్‌ను బాబు కలసి 30 నిమిషాల పాటు చర్చించారు. పార్టీ ఎంపీల సస్పెన్షన్‌పై పార్లమెంటులో లేవనెత్తాలని, దీనిపై చర్చకు పట్టుపట్టాలని బాబు ఆయనను కోరినట్టు సమాచారం.