‘చెక్కు బౌన్స్ ’ చట్ట సవరణ!
న్యూఢిల్లీ: చెక్కు బౌన్స్ కేసుల విచారణ వేగవంతంగా పూర్తి చేసేందుకు ‘నెగోషియబుల్ ఇన్ స్ట్రుమెంట్’చట్టానికి సవరణలు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. చెక్ బౌన్స్ వివాదాల పరిష్కారం చాలా క్లిష్టంగా ఉంటోందని పేర్కొన్నారు. దీంతో డబ్బు రాబట్టడానికి చాలా సమయం పడుతోందని చెప్పారు. నెగోషియబుల్ ఇన్ స్ట్రుమెంట్ చట్టానికి సవరణలు చేసేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చర్యలు చేపడుతోందని తెలిపారు.
ఎవరి చెక్కు బౌన్స్ అవుతుందో వారు ప్రతివాదన చేసేందుకు ముందే బౌన్స్ అయిన మొత్తానికి సరిపడా నగదును కోర్టులో డిపాజిట్ చేయాల్సి ఉంటుందని ఆ శాఖ ప్రతిపాదనలు చేసింది. చాలా కోర్టుల్లో పేరుకుపోయిన దాదాపు 18లక్షల చెక్కు బౌన్సు కేసుల పరిష్కారానికి ఈ సవరణలు ఎంతో ఉపయోగపడనున్నాయి.