భక్తిశ్రద్ధలతో ఛత్ సంబరాలు షురూ
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలో బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్ వాసులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఛత్ పూజలు ప్రారంభమయ్యాయి. మొత్తం నాలుగు రోజులు ఈ పండుగను జరుపుకొంటారు. ఇందులో భాగంగా మొదటి రోజు సోమవారం నాహాయ్-ఖాయ్ పూజను ఘనంగా నిర్వహించారు. స్త్రీ పురుషులు సూర్య భగవానుడిని అత్యంత నియమనిష్టలతో పూజించడం ఈ పండుగ ప్రత్యేకత. వ్రత ప్రక్రియ 72 గంటలలో పూర్తవుతుంది. రెండో రోజు ఖర్నా, మూడో రోజు డాలా ఛట్, నాలుగో రోజును పెహలా పేరిట ఈ పండుగను నిర్వహించనున్నారు. బుధవారం సాయంత్రం భక్తులు మోకాలిలోతు నీటిలో నిలబడి అస్తమించే సూర్యుడికి ఆరోగ్య ప్రసాదాలను, ఐదో రోజు ఉదయించే సూర్య భగవానుడికి ఆరోగ్య ప్రసాదాలను సమర్పిస్తారు. అనంతరం భక్తులు ఉపవాసాలను విరమించి బంధుమిత్రులతో వనభోజనాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందుకు ఢిల్లీలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. యుమనా నది తీరంతోపాటు వివిధ కాలనీల్లో బహుళ అంతస్తుల టైలపై ఏర్పాటు చేసే కృత్రిమ చెరువులు ఈ పండుగకు వేదికలుగా మారాయి. నగరంలో సుమారు వెయ్యి చోట్ల ఏర్పాట్లు చేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
యమునా నది తీరంలో..
యమునా నది తీరంలో 24 ఘాట్ల వద్ద ఛత్ పూజ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇండియాగేట్, బిర్లా మందిర్‌తో పాటు అనేక కాలనీలలో కృత్రిమ చెరువులను ఏర్పాటు చేసి ట్యాంకర్లతో నీరు నింపుకొన్నారు. నగరంలో పూర్వాంచలీయుల( బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినవారి) సంఖ్య లక్షలకు చేరుకొంది. దీంతోపాటు వారు బలమైన రాజకీయ శక్తిగా ఎదగడంతో ఈ వ్ర తం ఆచరించేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఇందు కోసం యమునా నది ఒడ్డున ప్రత్యేక ఘాట్ల వద్ద భారీ ఏర్పాట్లు చేశారు.మార్కెట్లకు కళ : నగరంలోని మార్కెట్లు ఛత్ పూజ సామగ్రితో కళకళలాడుతున్నాయి. ప్రజలు భారీగా తరలి వచ్చి పూజాసామగ్రిని కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లు జనంతో రద్దీగా మారాయి. పూజ సామగ్రిని బీహార్, యూపీల నుంచి ప్రత్యేకంగా తెప్పించినట్లు దుకాణదారులు చెబుతున్నారు. సుమారు రు.10 కోట్ల వ్యాపారం జరుగుతందని అంచనా.