రామన్న నేతృత్వంలోనే..!
దుమ్ముగూడెం(భద్రాచలం): ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు సీఆర్పీఎఫ్ జవాన్లపై చేసిన తాజా దాడి రాష్ట్రంలోని 4 జిల్లాలకు నేతృత్వం వహిస్తున్న దండకారణ్య కార్యదర్శి రామన్న సారథ్యంలోనే జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. సుక్మా జిల్లా చింతల్‌నార్ వద్ద ఆరేళ్ల క్రితం 76 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని బలితీసుకున్న మావోయిస్టుల దాడిలోనూ ఆయనే కీలక పాత్ర పోషించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. 40 ఏళ్ల క్రితం దండకారణ్యంలోకి ప్రవేశించిన రామన్న కీలకనేతగా ఎదుగుతూ వచ్చారు. ఛత్తీస్‌లో వామపక్ష తీవ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా పదేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సల్వాజుడుం, కోబ్రా, సీఆర్పీఎఫ్ బలగాలతో విస్తృత కూంబింగ్ సాగిస్తున్నాయి.
మూడేళ్ల నుంచి ధర్మపేట, గొల్లపల్లి, ఎలకనగూడెం, దుమ్ముగూడెం మండల సరిహద్దులోని పైడిగూడెం, గౌరారం గ్రామాల్లో సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి గాలింపు జరుపుతున్నారు. గ్రామస్తులకు వివిధ రకాల సరుకులు, యువకులకు క్రీడా సామగ్రి ఇస్తూ వారిని ఆకర్షిస్తున్నారు. ఫలితంగా మావోల షెల్టర్ జోన్‌గా ఉన్న దండకారణ్యం కాస్తా పోలీసుల చేతిలోకి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మావోయిస్టులు తమ మనుగడ కోసం వ్యూహాత్మకంగా పోలీసులపై మెరుపు దాడులకు దిగుతున్నారు. ఈ ఏడాది మార్చి 11న బెర్జి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు నిర్మాణ పనులు తనిఖీ చేస్తున్న సీఆర్పీఎఫ్ బలగాలపై దాడి చేసి 12 మందిని చంపేశారు.