
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ ఇటీవలే తన మంత్రివర్గాన్ని విస్తరించిన విషయం తెలిసిందే. తొలిసారి సీఎంగా పగ్గాలు చేపట్టిన ఆయన మొత్తం 12 మంది ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం కల్పించారు. వీరిలో ఓ మహిళ కూడా ఉండటం గమనార్హం. కాగా ఆయన కేబినెట్‌లోని మంత్రులంతా కోటీశ్వరులేనని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్), ఛత్తీస్‌గఢ్ ఎలక్షన్ వాచ్ తాజాగా నివేదిక విడుదల చేశాయి. వీరందరి సగటు ఆస్తి విలువ రూ. 47.13 కోట్లని వెల్లడించాయి.
ఆయన ఆస్తి విలువ రూ. 500 కోట్లు!
భూపేశ్ బఘేల్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న ఎమ్మెల్యేలందరిలో అంబికాపూర్ ఎమ్మెల్యే టీఎస్ బాబా రూ. 500.01 కోట్ల సంపాదనతో అగ్రస్థానంలో నిలవగా.... కోంటా నియోజకవర్గానికి చెందిన గిరిజన నేత కవాసి లక్ష్మా రూ. 1.9 కోట్ల ఆస్తి కలిగి ఉండి చివరి స్థానం పొందారని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. ఇక సీఎం భూపేశ్ బఘేల్ ఆస్తి రూ. 21.5 కోట్లుగా పేర్కొన్న ఏడీఆర్... మిగిలిన 9 మంది మంత్రుల ఆస్తుల విలువ రూ. 8 కోట్లలోపే అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment