సాక్షి, న్యూఢిల్లీ : ఆర్‌బీఐ స్వతంత్ర ప్రతిపత్తిని నీరుగార్చేందుకు నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరం ఆరోపించారు. ఆర్‌బీఐ మూలధన నిబంధనలను మార్చే అత్యవసర పరిస్థితి ఏమిటో కేంద్రం వివరించాలన్నారు. ఆర్‌బీఐని చెప్పుచేతల్లో ఉంచుకునేందు కేంద్రం చేస్తున్న ప్రయత్నాల్లో హేతుబద్ధతను చిదంబరం ప్రశ్నించారు.
బీజేపీ ప్రభుత్వం మరో నాలుగు నెలలు మాత్రమే అధికారంలో ఉండే క్రమంలో ఆర్‌బీఐ విషయంలో ఎందుకు తొందరపాటుగా వ్యవహరిస్తోందని ఆయన నిలదీశారు. ఆర్థిక పరిస్థితి సజావుగా ఉందని చెబుతూనే కేంద్రం ఆర్‌బీఐ నిధులను కోరడాన్ని ఆక్షేపిస్తూ చిదంబరం వరుస ట్వీట్లు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి నిధుల అవసరం లేకుంటే నాలుగు నెలల్లో ఎన్నికలకు వెళుతున్న తరుణంలో కేంద్ర బ్యాంక్‌పై ఎందుకు ఒత్తిడి పెంచుతున్నారని ప్రశ్నించారు.
నాలుగున్నర సంవత్సరాలుగా మోదీ సర్కార్ ఈ విషయంలో ఎందుకు మౌనం దాల్చిందని నిలదీశారు. ఆర్‌బీఐ మిగులు నిల్వలలో రూ 3.5 లక్షలు తమకు బదలాయించాలని కేంద్ర ప్రభుత్వం కేంద్ర బ్యాంక్‌ను కోరిందనే వార్తలను ప్రభుత్వం తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం వద్ద తగినన్ని నిధులున్నాయని, ఆర్‌బీఐ నిల్వలను సేకరించాలనే ఉద్దేశం లేదని ఇటీవల ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment