సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రిగా సుదీర్ఘ కాలం పనిచేసిన చిదంబరం భూమికి భారమే తప్ప ఆయన వల్ల దేశానికి ఒరిగేదీమీ లేదంటూ అనుచిత వ్యాఖ్యలతో విరుచుకపడ్డారు. కావేరి నది నీటి వివాదం సహా తమ రాష్ట్రానికి సంబంధించిన ఏ సమస్యలను చిదంబరం పరిష్కరించలేదని మండిపడ్డారు.
జమ్మూ కశ్మీర్‌లో చేసినట్లుగానే తమిళనాడును కేంద్ర భూభాగంగా మార్చాలని కేంద్రం నిర్ణయించినట్లయితే, అధికార ఏఐఎడీఎంకె దాన్ని వ్యతిరేకించదా అన్న చిదంబరం విమర్శలకు పత్రిగా పళనిస్వామి ఇలా స్పందించారు. చిదంబరం ఎన్నేళ్లు కేంద్రమంత్రిగా ఉంటే ఏం లాభం? ఆయన ఏయే పథకాలు తీసుకొచ్చారు (ప్రధానంగా తమిళనాడుకు)? దేశానికి ఆయన వల్ల ఏం ఉపయోగం.. భూమిపై భారం తప్ప అని ముఖ్యమంత్రి పళనిస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కాగా ఆర్టికల్ 370, 35-ఏ రద్దు, జమ్మూ కశ్మీర్ విభజనపై కేంద్రంపై చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌లో హిందువుల శాతం అధికంగా ఉంటే ఆర్టికల్ 370ని రద్దు చేసేవారా అని బీజేపీని ప్రశ్నించారు. ఎక్కువ శాతం ముస్లింలు ఉన్నందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఆర్టికల్ రద్దుకు కాంగ్రెస్ పార్టీ మతం రంగు పులిమే ప్రయత్నం చేస్తోందటూ ఈ విమర్శలను బీజేపీ తిప్పి కొట్టింది.
Comments
Please login to add a commentAdd a comment