సాక్షి, న్యూఢిల్లీ : ఉల్లిపాయల ధరలు ఆకాశాన్ని అంటి సామాన్యులు అల్లాడుతున్న క్రమంలో తాము ఉల్లిపాయలు ఎక్కువగా తినమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం మండిపడ్డారు. ఉల్లిపాయలు తిననని చెప్పిన మంత్రి అవకాడోలు తింటారా అని ఆయన ప్రశ్నించారు. ఆమె ఉల్లిపాయలు తినకున్నా వాటి ధరలు మండిపోతున్నాయని అన్నారు. ఐఎన్‌ఎక్స్ కేసులో 106 రోజులు జైలులో ఉండి బుధవారం బెయిల్‌పై విడుదలైన చిదంబరం నేడు పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. మీడియా సమావేశంలో చిదంబరం మాట్లాడుతూ మోదీ సర్కార్ ఆర్థిక వ్యవస్థను సమర్ధంగా నడిపించడంలో విఫలమైందని విమర్శించారు.
ఆర్థిక వ్యవహారాల్లో కేంద్రం అసమర్ధ మేనేజర్‌గా మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. గ్రామీణ వినియోగం, వేతనాలు దారుణంగా పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధి రేటును ఆర్బీఐ ఏడు శాతం అంచనా వేస్తే అది నాలుగు శాతానికే పరిమితమైందని ఇందుకు ఆర్బీఐ అసమర్ధ అంచనా కారణమా లేక కేంద్ర ప్రభుత్వ వైఫల‍్యమా అని చిదంబరం నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం తన గొంతును నొక్కేయాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థను మోదీ సర్కార్ కుప్పకూల్చిందని, ఎకానమీపై ప్రధాని నోరు మెదపడం లేదని చిదంబరం మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment