సాక్షి, న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును కుదించినందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్)తో పాటు ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్‌పై విరుచుకుపడేందుకు కేంద్ర మంత్రులు సిద్ధమవుతారని కాంగ్రెస్ నేత, ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం అన్నారు. నోట్ల రద్దును తొలిగా వ్యతిరేకించిన వారిలో ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ ఒకరని, ఐఎంఎఫ్..గీతా గోపీనాథ్‌లపై మంత్రుల దాడికి మనం సంసిద్ధం కావాలని చిదంబరం మంగళవారం ట్వీట్ చేశారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే భారత వృద్ధి రేటును 1.3 శాతం మేర కోత విధిస్తూ 4.8 శాతానికి ఐఎంఎఫ్ సోమవారం కుదించింది.
రుణాల జారీలో తగ్గుదల, దేశీయ డిమాండ్ పడిపోవడంతో భారత వృద్ధిరేటు అంచనాను తగ్గిస్తున్నట్టు దావోస్‌లో ప్రపంచ ఆర్థిక పరిస్ధితిపై ఐఎంఎఫ్ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే. భారత్‌లో వృద్ధి మందగమనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటునూ ప్రభావితం చేస్తుందని, వరల్డ్ ఎకానమీ వృద్ధి అంచనాను కూడా 0.1 శాతం మేర సవరించామని గీతా గోపీనాథ్ పేర్కొనడం గమనార్హం. కాగా భారత వృద్ధి రేటును సవరిస్తూ ఐఎంఎఫ్ తాజా అంచనా మరింత తగ్గవచ్చని చిదంబరం వ్యాఖ్యానించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment