మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ. చిదంబరం (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : జీఎస్టీని నిజాయితీకి ప్రతీకగా ప్రభుత్వం అభివర్ణించడాన్ని మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం తప్పుపట్టారు. 2014లో బీజేపీ అధికారంలోకి రాకముందు ఐదేళ్ల పాటు జీఎస్టీని ఎందుకు వ్యతిరేకించిందని ఆయన నిలదీశారు. జీఎస్టీ అమలై ఏడాది పూర్తవుతున్న క్రమంలో అమలు తీరును చిదంబరం ఆక్షేపించారు. జీఎస్టీ అమలైన తర్వాత రిఫండ్‌లు సకాలంలో చెల్లించకపోవడంతో లక్షలాది మంది వ్యాపారులు, ఎగుమతిదారుల సొమ్ము ప్రభుత్వం వద్ద చిక్కుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
జీఎస్టీ నిజాయితీకి ప్రతీకంగా బీజేపీ సర్కార్ చెబుతున్న నేపథ్యంలో మరి యూపీఏ హయాంలో జీఎస్టీని ఆ పార్టీ ఎందుకు వ్యతిరేకించిందో చెప్పాలని చిదంబరం వరుస ట్వీట్లలో డిమాండ్ చేశారు. తాత్కాలిక పత్రం జీఎస్టీఆర్-3బీని ప్రభుత్వం ఎంతకాలం వాడుతుందని, ఇది చట్టబద్ధంగా సరైనదేనా అని ప్రశ్నించారు. ఏడాది గడిచినా జీఎస్టీఆర్-ఫామ్ 2, ఫామ్ 3లను ఇంతవరకూ ఎందుకు నోటిఫై చేయలేదని నిలదీశారు. గత ఏడాది జులై 1 నుంచి జీఎస్టీ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment