
'నా కుమారుడిని ఇంకెంతకాలం వేధిస్తారో..'
చెన్నై: మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి చెందినదిగా భావిస్తున్న చెస్ గ్లోబల్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థపై బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు నిర్వహించింది. ఈ సంస్థతో కలిసి అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, వాసన్ హెల్త్ కేర్ కంపెనీలు విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘనలకు పాల్పడ్డాయనే ఆరోపణల ఆధారంగా ఈడీ ఈ దాడులు నిర్వహించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఓ ల్యాప్ ట్యాప్ ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఇదిలాఉండగా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడుల నుంచి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం పక్కకు జరిగారు. ఈడీ దాడులు నిర్వహించిన సంస్థలకు తనకు, తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. తనకుగానీ, తన కుటుంబ సభ్యులకు ఆ సంస్థల్లో వాటాలు లేవని అన్నారు. 'మొత్తం మూడు సంస్థల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లు తనకు సమాచారం ఉంది. వాటిలో రెండు నా స్నేహితులవి. స్వయంగా ప్రొఫెనల్స్ అయినా వారే ఆ సంస్థలకు డైరెక్టర్లుగా కూడా ఉన్నారు. మరో సంస్థ ఎవరిదో నాకు తెలియదు. గతంలోనే నేను ఈడీ అధికారులకు చాలా స్పష్టంగా చెప్పాను నాకుటుంబానికి, నాకు అందులో వాటాలు లేవని. నాపై వచ్చే ఆరోపణలన్నీ కూడా అవాస్తవాలు' అని కార్తీ అన్నారు.
అంతకుముందు ఈ దాడులపై చిదంబరం కూడా స్పందిస్తూ తన కుమారుడిపై ఇంకెంతకాలం ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరించి దాడులు చేయిస్తారో, వేధిస్తారో తాను కూడా చూడాలనుకుంటున్నట్లు తెలిపారు. అయితే, ప్రభుత్వం మూర్ఖంగా పనిచేసినా ఈడీ శాఖలో నిబద్దులై పనిచేసే అధికారులు ఉన్నారని తనకు తెలుసని, వారు చట్ట ప్రకారమే వ్యవహరిస్తారని మరోమాటగా చెప్పారు.