Tamil Nadu Minister Senthil Balaji Arrested In Money Laundering Case, Details Inside - Sakshi
Sakshi News home page

నాటకీయ పరిణామాలు.. తమిళనాడు మంత్రిని అరెస్ట్‌ చేసిన ఈడీ.. కుప్పకూలిన బాలాజీ

Published Wed, Jun 14 2023 8:13 AM | Last Updated on Wed, Jun 14 2023 11:26 AM

Tamil Nadu Minister Senthil Balaji Arrested In Money Laundering Case - Sakshi

చెన్నై: తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్‌ శాఖల మంత్రి వి. సెంథిల్‌ బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అరెస్ట్‌ చేసింది. మనీలాండరింగ్‌ కేసులో బుధవారం తెల్లవారుజామున మంత్రిని అదుపులోకి తీసుకుంది.  చెన్నైలోని మంత్రి అధికారిక నివాసంలో 18 గంటలపాటు విచారించిన అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది. విచారణ అనంతరం బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో అరెస్ట్‌ చేస్తుండగా.. ఆ సమయంలో బాలాజీ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఛాతీ నొప్పి రావడంతో  ఆయన్ను చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు.

మంత్రి కన్నీరు
ఈడీ అధికారులు మంత్రిని అదుపులోకి తీసుకునే సమయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆసుపత్రి వెలుపల సైతం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. డీఎంకే అభిమానులు ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండగా.. వాహనంలో మంత్రి కన్నీరు పెట్టుకోవడం కనిపిస్తోంది. దీనికి  సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.


అనంతరం మంత్రులు ఉదయనిధి స్టాలిన్, ఎం సుబ్రమణియన్, ఈవీ వేలు ఆసుపత్రిని సందర్శించారు. సెంథిల్ బాలాజీ అపస్మారక స్థితిలో ఉన్నారని, ఐసీయూలో పరిశీలనలో ఉన్నారని మంత్రి శేఖర్ బాబు తెలిపారు. మరోవైపు సెంథిల్‌ బాలాజీ అరెస్టు గురించి తమ కుటుంబ సభ్యులకు ఈడీ అధికారులు కనీసం సమాచారం ఇవ్వలేదని డీఎంకే రాజ్యసభ ఎంపీ, సీనియర్ న్యాయవాది ఎలాంగో విమర్శించారు. మంత్రి అరెస్ట్‌ నేపథ్యంలో ఒమందూరర్ ప్రభుత్వ ఎస్టేట్ వద్ద అదనపు బలగాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను మోహరించారు.

మంత్రిని పరామర్శించిన సీఎం
అరెస్ట్ అయిన తర్వాత బాలాజీని కలిసేందుకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆస్పత్రికి చేరుకున్నారు. చికిత్స పొందుతున్న మంత్రిని పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. దర్యాప్తు సంస్థకు సహకరించినప్పటికీ, సెంథిల్ బాలాజీపై అధికారులు ఒత్తిడి తీసుకొచ్చారని,  అందువల్లే  ఛాతీ నొప్పి వచ్చిందని సీఎం పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆస్పత్రి బయట ఉన్న డీఎంకే కార్యకర్తలు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కాగా సెంథిల్‌బాలాజీకి చెందిన పలుప్రాంతాల్లో మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సోదాలు జరిపిన విషయం తెలిసిందే. చెన్నైలోని ఆయన నివాసాలు, కార్యాలయాలు, సచివాలయంలోని చాంబర్, కరూర్, కోయంబత్తూరు, ఈరోడ్‌లోని ఆయన సన్నిహితుల నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు 18 గంటలపాటు సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా వారికి సీఆర్‌పీఎఫ్, ఆర్‌పీఎఫ్‌ బలగాలు బందోబస్తు కల్పించారు.

సీఎం స్టాలిన్‌ సీరియస్‌
అయితే, సచివాలయంలో ఎలాంటి అనుమతులు పొందకుండా ఈడీ సోదాలు నిర్వహించడంపై డీఎంకే ప్రభుత్వం సీరియస్‌ అయింది. దీనిని సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడవటంగా సీఎం స్టాలిన్‌ అభివర్ణించారు. తాను అడిగిన ప్రశ్నలకు సమాధాన చెప్పలేక దొడ్డి దారిన వచ్చి మరీ దాడిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై బుధవారం మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. ‘రాజకీయంగా ఎదుర్కోలేని బీజేపీ, బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోంది. వీటికి మేం భయపడం. ఈ విషయం వారే గ్రహించే సమయం దగ్గరపడింది’అని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

దివంగత సీఎం జయలలిత హయాంలో(2011-2016) రవాణా శాఖ మంత్రిగా ఉన్న సెంథిల్‌ బాలాజీపై లంచాలు తీసుకుని ఉద్యోగాలిచ్చినట్లు (క్యాష్‌ పర్‌ జాబ్స్‌) కుంభకోణం కేసు ఉంది. ఇందులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.   

ఐటీ.. తరువాత ఈడీ
మంత్రి సెంథిల్‌ బాలాజీని టార్గెట్‌చేస్తూ గత నెలలోనూ ఆయన సోదరుడు, మిత్రులు, సన్నిహితులు, ఎక్సైజ్‌, విద్యుత్‌ శాఖల కాంట్రాక్టర్లపై ఐటీ సోదాలు వారం రోజుల పాటు సాగాయి .చైన్నె, కోయంబత్తూరు,కరూర్‌, ఈరోడ్‌లలోని 40 చోట్ల నాలుగైదు రోజులుగా సోదాలు జరిగాయి. ఈ సోదాల సమయంలో డీఎంకే వర్గాలు, సెంథిల్‌బాలాజీ మద్దతుదారులు తిరగబడడంతో ఐటీ అధికారులు బెంబేలెత్తిపోయారు. అయితే, అన్ని చోట్ల సోదాలు జరిగినా, మంత్రి నివాసాన్ని మాత్రం ఐటీ వర్గాలు వదలిపెట్టాయి. ఈ సోదాలు ముగిసిన పది రోజుల తర్వాత మరోసారి సెంథిల్‌బాలాజీని ఈడీ అధికారులు టార్గెట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement