చిక్కుల్లో చిదంబరం తనయుడు కార్తి
చెన్నై : కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం చిక్కుల్లో పడ్డారు. ఎయిర్ సెల్, మ్యాక్సీస్ ఒప్పందాల వ్యవహారంలో ఆయనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఎయిర్ సెల్, మ్యాక్సీస్ ఒప్పందంలో జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లతో కార్తి చిదంబరం మంగళవారం ఉదయం ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది.
కాగా 2006 సంవత్సరంలో మాక్సిస్ సంస్థ అక్రమంగా ఎయిర్ సెల్ లో 80 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు అప్పటి ఆర్థికమంత్రి చిదంబరం ప్రత్యేక చొరవ తీసుకొని అనుమతిచ్చారని ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే కార్తి చిదంబరంపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయపన్ను శాఖతో కలిసి అతడి ఆస్తులపై కూడా సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.