ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రియమైన ప్రధానికి శుభాకాంక్షలు చెప్పేందుకు ప్రముఖుల నుంచి సాధారణ ప్రజల వరకూ పోటీపడుతున్నారు. సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఉన్న ప్రధాని మోదీని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ శనివారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. గాంధీనగర్ లోని రాజ్ భవన్ లో ప్రధానమంత్రిని నరేంద్ర మోదీని కలిసి పుష్పగుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తనను కలిసేందుకు వచ్చిన చీఫ్ జస్టిస్‌ను ప్రధాని గుమ్మంలోకి ఎదురెళ్లి సాదరంగా ఆహ్వానించారు.
అలాగే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ...ప్రధానికి బర్త్డే విషెస్ చెప్పారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్, నితీష్ గడ్కరి, ఆనందీ బెన్ పటేల్, విజయ్ రూపానీ, రాజ్వర్థన్ సింగ్ రాథోడ్, సైనా నెహ్వాల్, విజేంద్ర సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, తమ శుభాకాంక్షలు తెలిపారు. యాపిల్ సీఈవో టిమ్ కుక్ కూడా ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచం అంతా ఒకే కుటుంబం అని టిమ్ కుక్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో తన పుట్టిన రోజు వేడుక జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.
ఇక ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్...ఒడిశాలోని పూరి సముద్రతీరాన ప్రధాని పుట్టిన రోజు సందర్భంగా చక్కటి సైకత శిల్పాన్ని రూపొందించారు. మోదీ చీపురు పట్టుకుని ఊడుస్తుండగా ’ఉయ్ ఆర్ కమిటెడ్ టూ స్వచ్ఛ్ భారత్’ అంటూ ప్రత్యేకంగా సైకత శిల్పాన్ని సృష్టించారు.