ఆస్పత్రి దుస్థితి చూసి.. సీఎం షాక్!
బీహార్ రాష్ట్రంలో ఇంకా అరాచక వ్యవస్థ రాజ్యమేలుతూనే ఉంది. ఈ విషయం సాక్షాత్తు ముఖ్యమంత్రి పరిశీలనలోనే తేలడంతో ఆయన అవాక్కయ్యారు. పాట్నా నగరంలో విజయదశమి రోజున తీవ్ర తొక్కిసలాట జరిగి 33 మంది మరణించినా.. ఇంకా అనేకమంది గాయపడినా, అక్కడ మాత్రం నిర్లక్ష్యం ఇంకా ఏమాత్రం వీడలేదు. ఈ ప్రమాదంలో గాయపడినవారిని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ పాట్నా వైద్యకళాశాల ఆస్పత్రికి వెళ్లారు. కానీ, అక్కడ ఎమర్జెన్సీ వార్డులో ఒక్క డాక్టర్ కూడా లేకపోవడం చూసి ఆయన షాకయ్యారు. కనీసం మందులు కూడా లేకపోవడం, ఆ వార్డు మొత్తం అపరిశుభ్రంగా, చిరాగ్గా ఉండటంతో ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
''అక్కడ వైద్యులు లేరు. నేను తొక్కిసలాట బాధితులతోను, ఇతర రోగులతో కూడా మాట్లాడాను. అక్కడ వైద్యులు రాసిన మందుల్లో 82 శాతం అసలు అందుబాటులో లేవు. బయటనుంచి తెచ్చుకుంటున్నారు. కేవలం ఇంజెక్షన్లే ఇక్కడ ఇస్తున్నారు. వెంటనే సూపరింటెండెంట్ను పిలిచాను. కానీ ఆయన కూడా లేరు'' అని సీఎం మాంఝీ వాపోయారు. దుప్పట్లను నెలరోజులకోసారే మారుస్తున్నారని, అప్పుడప్పుడు మాత్రమే 15 రోజులకు మారుస్తున్నారని ఆయన చెప్పారు. నిబంధనలేవీ ఇక్కడ పాటించట్లేదని, బాత్రూంలు కూడా చాలా అసహ్యంగా ఉన్నాయని, అసలక్కడ నీళ్లు రావట్లేదని తెలిపారు. 45 రోజుల క్రితం అడ్మిట్ అయిన రోగులను కూడా డాక్టర్లు చూడట్లేదని, రెగ్యులర్ రౌండ్లకు కూడా రావట్లేదని అన్నారు. దీనిపై ఆలోచించి రేపే కఠిన చర్యలు తీసుకుంటానని మాంఝీ చెప్పారు.