పెరుగుతున్న బాల నేరస్థులు
Published Mon, Dec 5 2016 5:22 PM | Last Updated on Sat, Aug 11 2018 8:45 PM
ముంబై: చేతిలో పుస్తకాలు, ఆడుకోవల్సిన వయసులో పిల్లలు నేరాలకు పాల్పడడం రాష్ట్ర పోలీసులకు పెద్ద సమస్యగా మారింది. వాటిని అరికట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోగా నేరాల సంఖ్య మరింత పెరగడం కలవరానికి గురి చేస్తోంది. 2015లో నమోదైన వివిధ నేరాల్లో 186 మంది పిల్లలను హత్య నేరం కింద, 269 మంది పిల్లలను హత్య యత్నం కింద అదుపులోకి తీసుకున్నారు.
మొత్తం నేరాల్లో పిల్లల ద్వారా జరిగిన నేరాలు రెండు శాతం పెరిగినట్లు నేర నివేదికలో తేలింది. అంతేకాకుండా తీవ్రంగా గాయపర్చడం, ఇళ్లలో దోపిడి, అత్యాచారం, అల్లర్లు, అసభ్యకరంగా ప్రవర్తించడం లాంటి నేరాల్లో 18 ఏళ్ల లోపు పిల్లలు అధికంగా ఉన్నట్లు రాష్ట్ర నేర నివేదికలో బయటపడింది. 2014లో రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలకు వ్యతిరేకంగా 5,175 నేరాలు నమోదయ్యాయి. ఈ సంఖ్యతో పోలిస్తే 2015లో 5.93 శాతం నేరాలు పెరిగాయి.
అత్యధికంగా నేరాలు ముంబైలో 873 జరిగాయి. పుణే(640 నేరాలు), థానే (363), నాగపూర్ (266), సాతారా(192)లు తర్వాతి స్ధానాల్లో నిలిచాయి. పుణే నగరంలో 16 హత్యా కేసుల్లో 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నమోదుచేసిన నేరాల్లో దర్యాప్తు చేపట్టి ముంబైలో అత్యధికంగా 1,123, పుణేలో 889 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 16-18 ఏళ్లలోపు పిల్లలు 97 శాతం, 12 ఏళ్లలోపు 1.7 శాతం పిల్లలు ఉన్నారు.
Advertisement
Advertisement