
బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం
బాలికల వయసు 15–18 ఏళ్ల మధ్య ఉంటే వారి వివాహాన్ని రద్దుచేయొచ్చని పార్లమెంట్ బాగా ఆలోచించి, వివేకంతో నిర్ణయం తీసుకుందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.
న్యూఢిల్లీ: బాలికల వయసు 15–18 ఏళ్ల మధ్య ఉంటే వారి వివాహాన్ని రద్దుచేయొచ్చని పార్లమెంట్ బాగా ఆలోచించి, వివేకంతో నిర్ణయం తీసుకుందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకునే బాల్య వివాహాలపై చట్టాన్ని రూపొందించామని పేర్కొంది. మైనర్ అయిన భార్యతో భర్త శృంగారం కొనసాగించడానికి అనుమతిస్తున్న నిబంధనలను సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు విచారించింది.
బాలికలు తమ వివాహాలను రద్దుచేసుకునేందుకు వేర్వేరు చట్టాల కింద వేర్వేరు వయోపరిమితులు విధించడంలో ఉన్న తర్కం ఏంటని జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాల బెంచ్ ప్రశ్నించింది. బాల్య వివాహాల రద్దుకు ప్రత్యేక చట్టమున్నా అవి కొనసాగడంపై ఆందోళన వ్యక్తం చేసింది. అవి అసలు పెళ్లిల్లు కావని, ఎండమావులని అభివర్ణించింది. ఈ పిటిషన్‌పై బుధవారం కూడా వాదనలు జరగనున్నాయి.