
'చైనా వస్తువులు అందుకే కొనొద్దన్నా'
న్యూఢిల్లీ: చైనా వస్తువులను బహిష్కరించాలని యోగా గురువు బాబా రాందేవ్ పిలుపునిచ్చారు. దీనికి గల కారణాన్ని 'ఇండియన్ ఎక్స్ ప్రెస్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. భారతదేశంలో సొమ్ము ఆర్జించి, పాకిస్థాన్ కు చైనా సహాయపడుతోందని ఆయన ఆరోపించారు. చైనా పాలకులపై సామాజిక-ఆర్థిక ఒత్తిడికి తీసుకురావాలన్న లక్ష్యంతోనే చైనా వస్తువులు వాడొద్దని పిలుపునిచ్చినట్టు తెలిపారు.
పాకిస్థాన్ కళాకారులతో నిషేధం గురించి ప్రశ్నించగా... 'కళాకారులు తీవ్రవాదులు కాదు. కానీ హిందీ సినిమాల్లో నటిస్తున్న పాక్ నటీనటులకు మనస్సాక్షి లేదు. ఎంతసేపు సినిమాలు, డబ్బు సంపాదన, బిర్యానీ తినడం గురించి ఆరాట పడుతుంటారు. ఉడీ ఉగ్రదాడిలో భారతీయులు చనిపోతే వారు ఎందుకు ఖండించలేద'ని రాందేవ్ నిలదీశారు.
పాకిస్థాన్ లో పతంజలి శాఖను ఎందుకు నిర్వహిస్తున్నారని అడగ్గా... 'నేను పాకిస్థాన్ నటీనటుల వంటివాణ్ణి కాదు. పాకిస్థాన్ లో సంపాదించిన డబ్బును ఇక్కడకు తరలించాలన్న ఆశ నాకు లేదు. అక్కడ ఆర్జించిన సొమ్మును పాకిస్థాన్ ప్రజల సంక్షేమానికి ఖర్చు పెడుతున్నాన'ని తెలిపారు. పంతజలిలో తనకు సింగిల్ షేరు కూడా లేదని, నిరాడంబర జీవితం గడుపుతున్నానని ఆయన చెప్పుకొచ్చారు.
ఎన్డీఏ రెండేళ్ల పాలనపై సంతృప్తిగా ఉన్నారా అని ప్రశ్నించగా... 'యోగికి సంతోషం, దుఃఖం అంటూ ఉండవు. ఈ రెండింటికి అతీతంగా ఉంటా. భారతదేశానికి నరేంద్ర మోదీ విజయవంతమైన ప్రధాన మంత్రి. ఆయనపై నాకు నమ్మకం ఉంది. రాజకీయాల పట్ల నాకు ఆసక్తి లేదు. నేనెప్పుడు రాజకీయ పదవులు ఆశించను' అని రాందేవ్ సమాధానమిచ్చారు.