చైనా అడ్డుకోవటం లేదు
భారత్‌కు ఎన్‌ఎస్‌జీ సభ్యత్వంపై సుష్మ
న్యూఢిల్లీ: అణు సరఫరా బృందం (ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌కు సభ్యత్వాన్ని చైనా వ్యతిరేకించడం లేదని, కొత్తగా సభ్యత్వం కల్పించేందుకు ఉద్దేశించిన విధివిధానాలపై చర్చమాత్రమే చైనా కోరుతోందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. రెండేళ్ల పాలనలో విదేశాంగ శాఖ సాధించిన వివరాలను ఆమె ఆదివారమిక్కడ వివరించారు. ‘చైనా మద్దతుతోపాటు ఎలాగైనా ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వం దక్కించుకుంటాం. ఏకాభిప్రాయ సాధనకే తీవ్రంగా కృషిచేస్తున్నాం’ అని చెప్పారు. ‘నేను వ్యక్తిగతంగా 23 దేశాలతో మాట్లాడుతున్నాను. ఒకరిద్దరు మాత్రమే కొన్ని అంశాలను లేవనెత్తారు. కానీ ఏకాభిప్రాయం సాధిస్తామనే నమ్మకం ఉంది’ అని అన్నారు. భారత్‌కు ఎన్‌ఎస్‌జీలో చోటు దక్కితే భవిష్యత్తులో పాక్ సభ్యత్వానికి అడ్డుపడే అవకాశాలున్నాయన్న వార్తలను ఖండించారు.
రెండేళ్లలో 3.68 లక్షల కోట్ల ఎఫ్‌డీఐలు
రెండేళ్లలో మోదీ విదేశీ పర్యటనల వల్ల రూ. 3.68 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయని సుష్మ తెలిపారు. లండన్‌లో తలదాచుకున్న మాల్యా, లలిత్‌మోదీల అప్పగింతపై బ్రిటన్‌తో చర్చించలేదన్నారు. ఇరాక్‌లో ఐసిస్ చెరలో ఉన్న 39 మంది భారతీయులు క్షేమంగా ఉన్నారని తెలిపారు.