nuclear suppliers group
-
ప్రధాని మోదీ అమెరికా పర్యటన విజయవంతం
-
ప్రధాని మోదీ అమెరికా పర్యటన విజయవంతం
-
వ్యతిరేకత న్యాయమే
భారత్‌కు ఎన్ఎస్జీ సభ్యత్వంపై చైనా అధికార పత్రిక - పాశ్చాత్య దేశాలు భారత్‌ను తప్పుదోవ పట్టిస్తున్నాయి - అమెరికా అండ ఉంటే.. ప్రపంచం వెనకున్నట్లు కాదు - సమస్యలకు పరస్పర అంగీకారంతో పరిష్కారం: చైనా సర్కారు బీజింగ్: అణు సరఫరా బృందం (ఎన్ఎస్జీ)లో భారత సభ్యత్వాన్ని వ్యతిరేకించడం నైతికంగా న్యాయమేనని చైనా స్పష్టం చేసింది. చైనా ప్రభుత్వ పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ సంపాదకీయంలో భారత్ అనుసరిస్తున్న తీరుతోపాటు.. పశ్చిమ దేశాలు భారత్‌ను తప్పుదోవ పట్టిస్తున్న విధానాన్ని తీవ్రంగా విమర్శించింది. ‘చైనా ఒక్కటే భారత అవకాశాలను అడ్డుకుంటోందన్న విమర్శలు సరికాదు. మరో పది దేశాలు కూడా ఇవే ప్రశ్నలను లేవనెత్తాయి. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ)పై సంతకాలు చేయకుండా ఎన్ఎస్జీలో ఎలా సభ్యత్వం ఇస్తారని ప్రశ్నించామంతే’ అని పేర్కొంది. జూన్ 24న సియోల్‌లో జరిగిన ఎన్ఎస్జీ భేటీకి ముందు.. ‘చైనా తప్ప మిగిలిన 47 దేశాలు భారత్‌కు అనుకూలంగా ఉన్నాయి’ అంటూ భారత మీడియాలో వచ్చిన వార్తలపై చైనా తీవ్రంగా మండిపడింది. ‘ఢిల్లీ ఎన్ఎస్జీ ప్రయత్నానికి నియమాలే అడ్డంకి. బీజింగ్ కాదు’ అని వెల్లడించింది. పాశ్చాత్య దేశాలకు భారత్ ‘బంగారు బాబు’గా దొరికిందని విమర్శించింది. ఇటీవలి కాలంలో పాశ్చాత్య దేశాలు భారత్‌కు ఎక్కువగా ప్రాధాన్యమిస్తూ చైనాను మాత్రం విస్మరిస్తున్నాయని ఆరోపించింది. చైనా జీడీపీలో కేవలం 20 శాతం మాత్రమే ఉన్న భారతదేశం.. చైనా కన్నా మంచి మార్కెట్ అని పాశ్చాత్యదేశాలు ప్రశంసిస్తున్నాయని విమర్శించింది. ఇది భారత్‌ను చెడగొట్టడమేనని పేర్కొంది. ‘భారత్‌లో కొందరు ఎన్ఎస్జీ విషయంలో చాలా నీచంగా మాట్లాడినా.. భారత ప్రభుత్వం మాత్రం చాలా హుందాగా వ్యవహరించింది. ప్రతి విషయాన్ని చైనాతో చర్చించింది. భారత జాతీయవాదులు ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి. చైనాతో గొడవకు దిగటం సమస్యకు పరిష్కారం కాదు. వారు భారత్ సూపర్ పవర్ కావాలనుకుంటున్నారు. సూపర్ పవర్ కావాలంటే ఎలాంటి వ్యూహాలు రచించాలో వారు తెలుసుకోవాలి’ అని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. అమెరికా మద్దతు తెలిపినంత మాత్రాన ప్రపంచమంతా భారత్ వెనకాలే ఉందనుకోవటం పొరపాటని, ఈ వాస్తవాన్ని భారత్ విస్మరించిందనివిమర్శించింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం చైనా ప్రవర్తిస్తుందని, కానీ భారత్ మాత్రం తమ లాభం గురించే ఆలోచిస్తుందని ఆరోపించింది. క్షిపణి సాంకేతికత నియంత్రణ వ్యవస్థ(ఎంటీసీఆర్) లో భారత్‌కు సభ్యత్వం, చైనాకు మొండిచేయి చూపటంపై స్పందిస్తూ.. ‘చైనీయుల మానసిక పరిపక్వత చాలా ఎక్కువ. ఇలాంటి అంతర్జాతీయ సంబంధాల విషయంలో అనవసరంగా స్పందించర’ని పేర్కొంది. కూర్చుని పరిష్కరించుకుందాం చైనాతో ఒకటి కాదు చాలా సమస్యలున్నాయంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై చైనా ప్రభుత్వం స్పందించింది. భారత్‌తో ఉన్న సమస్యలను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునేందుకు సిద్ధమేనని ప్రకటించింది. వివాదాస్పద అంశాల్లో పరిష్కారం దిశగా భారత్‌తో చర్చలు జరగనున్నట్లు తెలిపింది. ‘మోదీ ఇంటర్వ్యూపై రిపోర్టు మాకందింది. భారత్-చైనా సంబంధాలు బాగానే ఉన్నాయి. ద్వైపాక్షిక సంబంధాల ద్వారా అన్ని సమస్యల పరిష్కారానికి మేం పనిచేస్తున్నాం. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటాం’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హాంగ్ లీ తెలిపారు. -
'ఎన్ఎస్జీతో భారత్‌కే నష్టం'
న్యూఢిల్లీ: ఓ పక్క న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్‌లో భారత్ కు సభ్యత్వం కోసం ప్రధాని నరేంద్రమోదీ కంటిమీద కునుకులేకుండా పనిచేస్తుండగా ఆయన పార్టీకే చెందిన సీనియర్ నేత యశ్వంత్ సిన్హా మాత్రం ఆ ప్రయత్నమంతా వృధా అంటున్నారు. భారత్‌కు ఎన్ఎస్జీ సభ్యత్వం అవసరం లేదని అన్నారు. ఒక అభ్యర్థిలాగా సభ్యత్వం కోసం ఎన్ఎస్జీ తలుపుతట్టాల్సిన పనిలేదని చెప్పారు. 'ఎట్టి పరిస్థితుల్లో భారత్ ఎన్ఎస్జీ సభ్యత్వం తీసుకోవద్దు. ఒక దరఖాస్తు దారుగా వెళ్లాల్సిన పనిలేదు. ఒక వేళ మనకు సభ్యత్వం వస్తే.. మనం చాలా నష్టపోతాం. దానివల్ల పెద్ద ప్రయోజనం కూడా లేదు. గతంలో ఒకసారి మనకు అది అవసరం లేదనుకున్న సందర్బం కూడా ఉంది' అని ఆయన చెప్పారు. అధికారంలోకి వచ్చిన కొందరు నేతల తప్పుడు మార్గదర్శకాల ప్రభావానికి భారత ప్రభుత్వం లోనవుతుందని చెప్పారు. -
భారత్ పై మాట మార్చిన చైనా!
అంతర్జాతీయ అణు సరఫరాదారుల గ్రూప్ (ఎన్ఎస్ జీ)లో భారత్ చేరికపై గత కొన్ని రోజులుగా కొర్రిలు పెడుతూ వస్తున్న చైనా తాజాగా స్వరం మార్చింది. ఎన్ఎస్ జీలో భారత్ చేరికకు తాము మద్దతు ఇస్తామని అమెరికా విస్పష్టంగా ప్రకటించిన కొన్ని గంటల్లోనే తాను వ్యతిరేకం కాదంటూ సన్నాయి నొక్కులు ప్రారంభించింది. అణ్వాయుధ వ్యాప్తి నిరోధ ఒప్పందం (ఎన్పీటీ)పై సంతకం చేయని దేశాలు సైతం ఎన్ఎస్ జీలో చేరే విషయమై సభ్యదేశాలు చర్చలు జరుపవచ్చునని, నాన్ ఎన్పీటీ దేశాలు సైతం ఎన్ఎస్ జీలో చేరేందుకు ద్వారాలు ఇంకా తెరిచే ఉన్నాయని చైనా మంగళవారం స్పష్టం చేసింది. పైకి మిత్రదేశంగా నటిస్తూ కడుపునిండా కపట బుద్ధితో భారత్ కు అడుగడుగునా అడ్డుపడుతున్న చైనా.. ఎన్ఎస్ జీలో మన దేశం చేరికను బాహాటంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఈ నెల 23-24 తేదీల్లో జరిగే ఎన్ఎస్ జీ సభ్యదేశాల సమావేశం ఎజెండాలో భారత్ చేరిక లేదని ఆ దేశం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో భారత్ కు అమెరికా గట్టిగా మద్దతిస్తుండటంతో చైనా తాజాగా మాట మార్చింది. తాము భారత్, పాకిస్తాన్ సహా ఏ దేశాన్ని లక్ష్యంగా చేసుకోవడం లేదని, ఎన్ఎస్ జీలో చేరిక కోసం చర్చలకు అవకాశం ఉందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ తెలిపారు. -
చైనా అడ్డుకోవటం లేదు
భారత్‌కు ఎన్ఎస్జీ సభ్యత్వంపై సుష్మ న్యూఢిల్లీ: అణు సరఫరా బృందం (ఎన్ఎస్జీ)లో భారత్‌కు సభ్యత్వాన్ని చైనా వ్యతిరేకించడం లేదని, కొత్తగా సభ్యత్వం కల్పించేందుకు ఉద్దేశించిన విధివిధానాలపై చర్చమాత్రమే చైనా కోరుతోందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. రెండేళ్ల పాలనలో విదేశాంగ శాఖ సాధించిన వివరాలను ఆమె ఆదివారమిక్కడ వివరించారు. ‘చైనా మద్దతుతోపాటు ఎలాగైనా ఎన్ఎస్జీలో సభ్యత్వం దక్కించుకుంటాం. ఏకాభిప్రాయ సాధనకే తీవ్రంగా కృషిచేస్తున్నాం’ అని చెప్పారు. ‘నేను వ్యక్తిగతంగా 23 దేశాలతో మాట్లాడుతున్నాను. ఒకరిద్దరు మాత్రమే కొన్ని అంశాలను లేవనెత్తారు. కానీ ఏకాభిప్రాయం సాధిస్తామనే నమ్మకం ఉంది’ అని అన్నారు. భారత్‌కు ఎన్ఎస్జీలో చోటు దక్కితే భవిష్యత్తులో పాక్ సభ్యత్వానికి అడ్డుపడే అవకాశాలున్నాయన్న వార్తలను ఖండించారు. రెండేళ్లలో 3.68 లక్షల కోట్ల ఎఫ్‌డీఐలు రెండేళ్లలో మోదీ విదేశీ పర్యటనల వల్ల రూ. 3.68 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయని సుష్మ తెలిపారు. లండన్‌లో తలదాచుకున్న మాల్యా, లలిత్‌మోదీల అప్పగింతపై బ్రిటన్‌తో చర్చించలేదన్నారు. ఇరాక్‌లో ఐసిస్ చెరలో ఉన్న 39 మంది భారతీయులు క్షేమంగా ఉన్నారని తెలిపారు. -
చైనాకు తూచ్.. భారత్‌కే అమెరికా మద్దతు!
చైనాను తోసిరాజని.. భారతదేశానికి అమెరికా అండగా నిలిచింది. ఒకవైపు చైనా, మరోవైపు పాకిస్థాన్ వద్దని ఎంత మొత్తుకుంటున్నా.. భారతదేశం మాత్రం అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో చేరడం ఖాయమని అమెరికా బల్లగుద్ది చెబుతోంది. ఎన్ఎస్జీలో భారత్ చేరడాన్ని చైనా వ్యతిరేకించిన కొద్ది గంటల్లోనే భారతదేశానికి మద్దతుగా అమెరికా ముందుకొచ్చింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 2015లోనే చెప్పిన విషయాన్ని అమెరికా హోంశాఖ ప్రతినిధి జాన్ కిర్బీ గుర్తుచేశారు. మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్ నిబంధనలను భారతదేశం పాటిస్తోందని, అందువల్ల అణు సరఫరాదారుల బృందంలో చేరడానికి భారత్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని కిర్బీ అన్నారు. చైనా, పాకిస్థాన్ మాత్రం భారత సభ్యత్వం విషయంలో ముందునుంచే వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పారు. భారతదేశంతో తమకున్న విభేదాలను దృష్టిలో పెట్టుకుని అనవసరంగా పాకిస్థాన్‌ను వాడుకోవడం చైనాకు తగదని కూడా అమెరికా భావిస్తున్నట్లు ఇటీవల అమెరికా మీడియా తెలిపింది. 48 దేశాలతో కూడిన ఎన్ఎస్జీ బృందాన్ని విస్తరించాలంటే ఎన్పీటీ మీద సంతకం చేయడం ముఖ్యమని చైనా వాదిస్తోంది. అయితే.. భారత్‌ను పాకిస్థాన్ లాంటి దేశంతో పోల్చడం సరికాదని, లిబియా లాంటి దుష్టదేశాలకు పాకిస్థాన్ అణు టెక్నాలజీని అమ్ముతోందని అమెరికా చెబుతోంది. పాకిస్థాన్ అణు పితామహుడు డాక్టర్ ఎ.క్యు. ఖాన్ కూడా అంతర్జాతీయంగా అణు వ్యాపారంలో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తోంది. అణ్వస్త్రాలు లేని దేశంగా తాము ఉంటామంటూ సంతకం చేయాల్సిన ఎన్పీటీలో తాము చేరే ప్రసక్తి లేదని భారతదేశం ఎప్పుడో తన విధానాన్ని స్పష్టం చేసింది. దేశ భద్రత దృష్ట్యా అవి తప్పనిసరని చెబుతోంది. పైపెచ్చు, ఆ ఒప్పందం చాలా వివక్షాపూరితంగా ఉందని కూడా భారత్ వాదిస్తోంది.