వ్యతిరేకత న్యాయమే
భారత్‌కు ఎన్‌ఎస్జీ సభ్యత్వంపై చైనా అధికార పత్రిక
- పాశ్చాత్య దేశాలు భారత్‌ను తప్పుదోవ పట్టిస్తున్నాయి
- అమెరికా అండ ఉంటే.. ప్రపంచం వెనకున్నట్లు కాదు
- సమస్యలకు పరస్పర అంగీకారంతో పరిష్కారం: చైనా సర్కారు
బీజింగ్: అణు సరఫరా బృందం (ఎన్‌ఎస్జీ)లో భారత సభ్యత్వాన్ని వ్యతిరేకించడం నైతికంగా న్యాయమేనని చైనా స్పష్టం చేసింది. చైనా ప్రభుత్వ పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ సంపాదకీయంలో భారత్ అనుసరిస్తున్న తీరుతోపాటు.. పశ్చిమ దేశాలు భారత్‌ను తప్పుదోవ పట్టిస్తున్న విధానాన్ని తీవ్రంగా విమర్శించింది. ‘చైనా ఒక్కటే భారత అవకాశాలను అడ్డుకుంటోందన్న విమర్శలు సరికాదు. మరో పది దేశాలు కూడా ఇవే ప్రశ్నలను లేవనెత్తాయి. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ)పై సంతకాలు చేయకుండా ఎన్‌ఎస్జీలో ఎలా సభ్యత్వం ఇస్తారని ప్రశ్నించామంతే’ అని పేర్కొంది.
జూన్ 24న సియోల్‌లో జరిగిన ఎన్‌ఎస్జీ భేటీకి ముందు.. ‘చైనా తప్ప మిగిలిన 47 దేశాలు భారత్‌కు అనుకూలంగా ఉన్నాయి’ అంటూ భారత మీడియాలో వచ్చిన వార్తలపై చైనా తీవ్రంగా మండిపడింది. ‘ఢిల్లీ ఎన్‌ఎస్జీ ప్రయత్నానికి నియమాలే అడ్డంకి. బీజింగ్ కాదు’ అని వెల్లడించింది. పాశ్చాత్య దేశాలకు భారత్ ‘బంగారు బాబు’గా దొరికిందని విమర్శించింది. ఇటీవలి కాలంలో పాశ్చాత్య దేశాలు భారత్‌కు ఎక్కువగా ప్రాధాన్యమిస్తూ చైనాను మాత్రం విస్మరిస్తున్నాయని ఆరోపించింది. చైనా జీడీపీలో కేవలం 20 శాతం మాత్రమే ఉన్న భారతదేశం.. చైనా కన్నా మంచి మార్కెట్ అని పాశ్చాత్యదేశాలు ప్రశంసిస్తున్నాయని విమర్శించింది. ఇది భారత్‌ను చెడగొట్టడమేనని పేర్కొంది. ‘భారత్‌లో కొందరు ఎన్‌ఎస్జీ విషయంలో చాలా నీచంగా మాట్లాడినా.. భారత ప్రభుత్వం మాత్రం చాలా హుందాగా వ్యవహరించింది. ప్రతి విషయాన్ని చైనాతో చర్చించింది.
భారత జాతీయవాదులు ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి. చైనాతో గొడవకు దిగటం సమస్యకు పరిష్కారం కాదు. వారు భారత్ సూపర్ పవర్ కావాలనుకుంటున్నారు. సూపర్ పవర్ కావాలంటే ఎలాంటి వ్యూహాలు రచించాలో వారు తెలుసుకోవాలి’ అని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. అమెరికా మద్దతు తెలిపినంత మాత్రాన ప్రపంచమంతా భారత్ వెనకాలే ఉందనుకోవటం పొరపాటని, ఈ వాస్తవాన్ని భారత్ విస్మరించిందనివిమర్శించింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం చైనా ప్రవర్తిస్తుందని, కానీ భారత్ మాత్రం తమ లాభం గురించే ఆలోచిస్తుందని ఆరోపించింది. క్షిపణి సాంకేతికత నియంత్రణ వ్యవస్థ(ఎంటీసీఆర్) లో భారత్‌కు సభ్యత్వం, చైనాకు మొండిచేయి చూపటంపై స్పందిస్తూ.. ‘చైనీయుల మానసిక పరిపక్వత చాలా ఎక్కువ. ఇలాంటి అంతర్జాతీయ సంబంధాల విషయంలో అనవసరంగా స్పందించర’ని పేర్కొంది.
కూర్చుని పరిష్కరించుకుందాం
చైనాతో ఒకటి కాదు చాలా సమస్యలున్నాయంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై చైనా ప్రభుత్వం స్పందించింది. భారత్‌తో ఉన్న సమస్యలను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునేందుకు సిద్ధమేనని ప్రకటించింది. వివాదాస్పద అంశాల్లో పరిష్కారం దిశగా భారత్‌తో చర్చలు జరగనున్నట్లు తెలిపింది. ‘మోదీ ఇంటర్వ్యూపై రిపోర్టు మాకందింది. భారత్-చైనా సంబంధాలు బాగానే ఉన్నాయి. ద్వైపాక్షిక సంబంధాల ద్వారా అన్ని సమస్యల పరిష్కారానికి మేం పనిచేస్తున్నాం. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటాం’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హాంగ్ లీ తెలిపారు.