కిబితు(అరుణాచల్ ప్రదేశ్): భారత్, చైనాల మధ్య సరిహద్దుల్లో మరోసారి ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. గతేడాది డోక్లాం వివాదం నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగగా.. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్‌లోని అసఫిలా ప్రాంతంలో భారత బలగాల పహారాపై చైనా అభ్యంతరంతో విభేదాలు ఏర్పడ్డాయి. సరిహద్దుల్లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్‌ఏసీ) వద్ద వ్యూహాత్మకంగా సున్నిత ప్రాంతమైన అసఫిలా వెంట భారత్ ఆక్రమణలకు పాల్పడిందని ఆరోపిస్తూ గత నెల్లో చైనా తన అభ్యంతరాన్ని తెలియచేసింది. అయితే ఈ ఆరోపణల్ని భారత్ తోసిపుచ్చిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి.
‘మార్చి 15న జరిగిన ‘బోర్డర్ పర్సనల్ మీటింగ్’(బీపీఎం)లో ఈ అంశాన్ని చైనా లేవనెత్తగా.. భారత ఆర్మీ వాటిని తిరస్కరించింది. అరుణాచల్‌లోని ఎగువ సుబాన్‌సిరి ప్రాంతం భారత భూభాగమని, అక్కడ నిరంతరం పహారా కొనసాగుతుందని మన అధికారులు చైనాకు స్పష్టం చేశారు’ అని ఆ వర్గాలు వెల్లడించాయి. బలగాల పహారాను ఆక్రమణలుగా పేర్కొంటూ చైనా వాడిన పదజాలంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. డోక్లాం వివాదాం నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఎల్‌ఏసీ వెంట భారత్ యుద్ధ సన్నాహక కసరత్తుల్ని పెంచిందని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment