
భోపాల్ : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్ నాథ్ హాజరు కాకపోవడాన్ని మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తప్పుపట్టారు. యోగ చేయడంద్వారా రాష్ట్ర ప్రజలు, యువత ఫిట్‌గా ఉండేలా ముఖ్యమంత్రి కమల్ నాథ్‌జీ ప్రోత్సహించి ఉండాల్సిందని చౌహాన్ వ్యాఖ్యానించారు. కేవలం అధికార యంత్రాంగాన్ని నడిపించడం ఒక్కటే సీఎం పని కాదని, రాష్ట్రానికి ఓ దశా-దిశను నిర్ధేశం చేయాల్సిన గురుతర బాధ్యత ఆయనపై ఉందని అన్నారు.
యోగ కార్యక్రమంలో పాల్గొనకుండా ఆయన తన సంకుచిత మనస్తత్వాన్ని వెల్లడించారని చౌహాన్ ఆక్షేపించారు. భోపాల్‌లోని లాల్ పరేడ్ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో ఏర్పాటు చేయకపోవడం పట్ల కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని ఏ ఒక్క పార్టీకో చెందిన వ్యక్తి కాదని, దేశ ప్రజలందరికీ ఆయన ప్రధాని అని విపక్షం అర్దం చేసుకోవాలని చురకలు వేశారు. ప్రధాని మోదీ చొరవతోనే ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యోగా దినం ప్రకటించిందని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment