చర్చిలపై కేంద్రమంత్రి వ్యాఖ్యలు
చర్చిలపై కేంద్రమంత్రి వ్యాఖ్యలు
Published Thu, Apr 13 2017 4:31 PM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM
తిరువనంతపురం: చర్చిలు రాజకీయాలకు దూరంగా ఉండాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఆయన తిరువనంతపురంలో మీడియాతో మాట్లాడారు. క్రైస్తవ ప్రార్థనా మందిరాలు ఆధ్యాత్మిక కార్యకలాపాలపైనే దృష్టి పెట్టుకోవాలని, రాజకీయాల జోలికి రావద్దని కోరారు. కేరళలో బీజేపీ అభివృద్ధికి అక్కడి చర్చిలు ఆటంకంగా మారాయని భావిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా జవాబిచ్చారు. కాంగ్రెస్ ‘మునిగిపోయే పడవ’ లాంటిదని, తెలివైన వారెవరూ అందులో ఉండరని అన్నారు.
కేరళ కాంగ్రెస్ నాయకులు తమ పార్టీలో చేరేలా ఎలాంటి ప్రయత్నాలు చేయటం లేదని అన్నారు. తమ పార్టీలతో చేరేందుకు పలువురు నాయకులు సంప్రదింపులు జరుపుతున్నారని అన్నారు. 2014 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంటరీ నియోజకవర్గాల్లో బీజేపీ రెండో స్థానంలో నిలిచిన ప్రాంతాలపై తాము దృష్టిపెట్టామని చెప్పారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం రాష్ట్రంలో పర్యటిస్తున్నానని తెలిపారు. కేరళ అసెంబ్లీలో 140 మంది సభ్యులుండగా బీజేపీకి కేవలం ఒకే ఒక్క సభ్యుడు ఉన్నారు. లోక్‌సభ, రాజ్యసభల్లో కేరళ రాష్ట్రం నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం లేదు.
Advertisement