180 మందిని కాపాడి శభాష్ అనిపించుకుంది..
ఒకటికాదు రెండు కాదు.. ఏకంగా 180 ఆత్మహత్యల్ని అడ్డుకున్నారు. రకరకాల సమస్యలతో కునారిల్లిపోతూ రైలు పట్టాలపై ప్రాణాలర్పించేందుకు సిద్ధమైన బాధితులను గుర్తించి.. కౌన్సిలింగ్ ఇచ్చి జీవితంపై కొత్త ఆశలు చిగురించేలా చేశారు. ఇదంతా చేసింది ఏ స్వచ్ఛంద సంస్థో కాదు.
ఒకచేత్తో లాఠీ, మరో చేతిలో అధునాతన ఆయుధం.. ప్రజలు ఆందోళనలకు దిగినప్పుడల్లా అణచివేతకు దిగే అర్ధ సైనిక బలగం సీఐఎస్ఎఫ్ ఇప్పుడు ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలుస్తోంది. గడిచిన ఏడాది కాలంగా దేశ రాజధాని ఢిల్లీ మెట్రో రైల్వే ట్రాక్ లపై ఆత్మహత్యలకు ప్రయత్నించిన 180 మందిని కాపాడి శభాష్ అనిపించుకుంటోంది.
ఎయిర్ పోర్టుల తర్వాత బంగారం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతోంది మెట్రో రైళ్లలోనే కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో రైల్ స్టేషన్ల వద్ద రక్షణ వ్యవస్థను పటిష్టం చేసే దిశగా సీఐఎస్ఎఫ్ బలగాలను మోహరించారు. ఈ క్రమంలోనే ఢిల్లీ మెట్రో రైల్లో సీఐఎస్ఎఫ్ పలు నేరాల్ని అడ్డుకుంది. వాటిలో కొన్నే ఇవి..
* దాదాపు 10 వేల మంది పురుషుల్ని మహిళల కోచ్ ల నుంచి దింపేశారు.
* 6 ఆయుధాలు, 120 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
* రూ.10.2 విలువైన బంగారంతోపాటు రూ. 10.8 కోట్ల అక్రమ ధనాన్ని గుర్తించారు.
* 382 మంది జేబు దొంగల్ని అరెస్టు చేశారు. అందులో చోరీకి పాల్పడినవారిలో 90 శాతం మంది మహిళలే ఉండటం గమనార్హం.