సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఆమోదం పొందిన వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లు 2016ను కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెడుతుండటంతో ఈశాన్య రాష్ట్రాలు తీవ్ర నిరసన తెలుపుతున్నాయి. ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ల నుంచి ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వం కల్పించేలా చేపట్టిన ఈ సవరణ బిల్లును అసోం సహా ఈశాన్య రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీకి చెందిన అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పెమా ఖండూ, మణిపూర్ సీఎం బీరేన్ సింగ్‌లు సైతం బిల్లుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, 2014, డిసెంబర్ 31లోగా భారత్‌లో ప్రవేశించిన పొరుగు దేశాలకు చెందిన ముస్లింలు కాకుండా హిందువులు, పార్శీలు, సిక్కులు, బౌద్ధులు, క్రైస్తవులు, జైన్‌లకు భారత పౌరసత్వం ఇచ్చేలా ఈ బిల్లును సవరించారు. వలసదారుల పట్ల వివక్ష తగదని, దేశంలోకి తరలిచ్చిన ప్రతిఒక్కరికీ వారి మతంతో సంబంధం లేకుండా పౌరసత్వ హక్కు కల్పించాలని ఈశాన్య రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి.
బంగ్లాదేశ్ నుంచి 1971 మార్చి తర్వాత దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన హిందూ వలసదారులకు పౌరసత్వం కల్పించేలా రూపొందిన ఈ బిల్లు 1985 అసోం ఒప్పందానికి విరుద్ధమని నిరసనకారులు పేర్కొంటున్నారు. కాగా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ భారతరత్నను వెనక్కిఇవ్వాలని అస్సామీ గాయకుడు భూపేన్ హజారికా కుటుంబం యోచిస్తోంది. మరోవైపు పౌరసత్వ బిల్లుకు నిరసనగా ఇటీవల ప్రధాని మోదీ గౌహతి పర్యటనలో నిరసనకారులు నల్లజెండాలు ప్రదర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment