ఈ దేశాల్లో ‘చెత్త’శుద్ధి భేష్! | cleanness matter in some countries are good | Sakshi
Sakshi News home page

ఈ దేశాల్లో ‘చెత్త’శుద్ధి భేష్!

Published Sun, Mar 1 2015 6:36 AM | Last Updated on Sat, Sep 2 2017 10:08 PM

cleanness matter in some countries are good

న్యూఢిల్లీ:

భారత్‌లో బహిరంగ విసర్జన చేస్తున్నవారి సంఖ్య... 60 కోట్లు
ఇది దేశ జనాభాలో దాదాపు.. 48 శాతం! ఐక్యరాజ్యసమితి తాజాగా వెల్లడించిన వాస్తవమిది. అంతేనా దేశంలో ఏ రాష్ట్రానికి, ఏ పట్టణానికి వెళ్లినా ఎక్కడ చూసినా చెత్తాచెదారం, అపరిశుభ్ర వాతావరణం. ఇక బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో టాయిలెట్లకు వెళ్లిన మరుక్షణమే ముక్కు మూసుకొని బయటపడాల్సిందే! ఈ పరిస్థితిని మార్చేందుకు మోదీ సర్కారు చర్యలు చేపడుతోంది. ‘స్వచ్ఛ భారత్’ను ఓ యుద్ధంలా ముం దుకు తీసుకువె ళ్తోంది. తాజా బడ్జెట్‌లోదీనికి పెద్దపీట వేసింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే పరిశుభ్రమైన దేశాలుగా ఆసియాలోని కొన్ని దేశాలు పేరొందాయి. అక్కడ పరిస్థితి ఎలా ఉంది..? ఆ ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకున్నాయి..? వాటి నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలేంటి..? ఓసారి చూద్దాం
 
సింగపూర్..
శుభ్రత, పరిశుభ్రత!
 
ఆగ్నేయాసియాలో అతిచిన్న దేశమైన సింగపూర్ పరిశుభ్రతకు పెట్టింది పేరు. పారిశుద్ధ్యానికి అక్కడి ప్రభుత్వం ఎప్పట్నుంచో పెద్దపీట వేస్తోంది. 1967లోనే ‘సింగపూర్ క్లీన్ క్యాంపెయిన్’ చేపట్టింది. పరిశుభ్రత కోసం ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలు, నిబంధనలను నిర్దేశించుకుంటూ ముందుకు వెళ్తోంది. ఎటు చూసినా పచ్చని చెట్లు, ఆహ్లాదకర వాతావరణం కనిపించేలా సింగపూర్‌ను ‘గార్డెన్ సిటీ’గా మార్చే దిశగా సాగుతోంది. నగరంలో ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన నీరు అందిస్తోంది. వాతావరణ పరిరక్షణకు చాలా ఏళ్ల నుంచే మూడు ‘ఆర్’ల(రెడ్యూస్-తగ్గించు, రీయూజ్-పునర్వినియోగం, రీసైకిల్-పునరుత్పాదన) విధానాన్ని అమలు చేస్తోంది.
 
జపాన్..
ప్రజల జీవితాల్లో ఓ భాగం
పరిశుభ్రత అనేది ఈ దేశ ప్రజల జీవితాల్లో ఒక భాగం. జీవితాల్లోనే కాదు ఆధ్యాత్మికంగానూ దీనికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ‘షింటోయిజం’లో పరిశుభ్రత ఆవశ్యకతను నొక్కిచెప్పారు. మీజీ చక్రవర్తి పాలన (1868-1912) సమయంలోనే ‘నిర్మల జపాన్’ను ఉద్యమంగా చేపట్టారు. పరిశుభ్రతను జాతీయవాదంతో సమానంగా గౌరవించారు. ఈ దేశంలోని స్కూళ్లలో విద్యార్థులు, టీచర్లు కలసి టాయిలెట్లను క్లీన్ చేసే కార్యక్రమం నిరాటంకంగా సాగుతుంది. ప్రజల దైనందిన జీవితాల్లోనూ ‘క్లీన్ అండ్ గ్రీన్ విడదీయరాని భాగం. జపాన్‌లో చాలా ఇళ్లలో ముఖం కడుక్కునేందుకు, పళ్లు తోముకునేందుకు, స్నానానికి, టాయిలెట్లకు వేర్వేరు గదులు ఉంటాయి.
 
దక్షిణ కొరియా..
ప్రజల భాగస్వామ్యం
దేశంలో ప్రజల జీవన నాణ్యతా ప్రమాణాలు గణనీయంగా పెంచేందుకు దక్షిణ కొరియా ప్రభుత్వం ఐదేళ్ల ప్రణాళిక రచించింది. ఇందులో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణకు పెద్దపీట వేసింది. గ్రామీణ ప్రాంతాలను సుసంపన్నం చేసేందుకు చేపట్టిన ‘న్యూ విలేజ్’ ఉద్యమంలో క్లీన్ అండ్  గ్రీన్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ప్రజలను పెద్దఎత్తున  భాగస్వాములను చేస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. లీకేజీలకు తావు లేకుండా మురుగునీటి వ్యవస్థలను పక్కాగా నిర్వహిస్తోంది. ఘన వ్యర్థాల నిర్వహణకు పర్యావరణ శాఖ 2002-2011కు సుదీర్ఘ లక్ష్యాలను నిర్దేశించుకుంది. మెట్రోపాలిటన్ నగరాల్లో చెత్తాచెదారాన్ని ప్రభుత్వమే సేకరించి రీసైకిల్ చేస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement