సబ్సిడీల్లో 10 శాతం కోత
న్యూఢిల్లీ: ఆహారం, ఎరువులు, పెట్రోలియంపై సబ్సిడీల్లో 10 శాతం కోతవేశారు. ముఖ్యంగా పెట్రోలియంపై సబ్సిడీలను భారీగా కత్తిరించడంతో 2015-16 బడ్జెట్‌లో సబ్సిడీలు రూ.2.27 లక్షల కోట్లకు తగ్గాయి. ఆర్థిక మంత్రి జైట్లీ శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం ఈ మూడింటిపై 2,27,387.56 కోట్లను సబ్సిడీల కింద కేటాయించారు. గత బడ్జెట్‌లో (సవరించిన అంచనాలు) ఈ బిల్లు రూ.2,53,913.12 కోట్లుగా ఉంది.
ఆహారానికి గత బడ్జెట్‌లో రూ.1,22,675.81 కోట్లు ఉండగా, ఇప్పుడు రూ.1,24,419 కోట్లను రాయితీల కింద కేటాయించారు.. ఇందులో జాతీయ ఆహార భద్రత చట్టం అమలుకు దాదాపు రూ.65 వేల కోట్లు ప్రతిపాదించారు. ఎరువులపై సబ్సిడీ గత బడ్జెట్‌లో రూ.70,967.31 కోట్లు ఉండగా, ఇప్పుడు రూ.72.968.56 కోట్లు కేటాయించారు. పెట్రోలియంకు గత బడ్జెట్‌లో రూ.60,270 కోట్ల సబ్సిడీ ఉండగా, ఇప్పుడు రూ.30 వేల కోట్లు కేటాయించారు. ఇందులో ఎల్పీజీ సబ్సిడీకి రూ.22 వేల కోట్లు కాగా మిగతా మొత్తం కిరోసిన్‌కు కేటాయించారు.