
భారత 71వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జార్ఖండ్ రాష్ట్రానికి కొత్త లోగో తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త లోగో రూపకల్పనకు సలహాలు, సూచనలు ఇవ్వాలని సీఎం హేమంత్ సోరెన్ ప్రజలను కోరారు. ఈ మేరకు ఆదివారం రోజున ఒక అధికారికి ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరి 11 లోగా ప్రజలు తమవంతుగా ప్రతి ఒక్కరూ భాగస్వాములై విలువైన సూచనలు, సలహాలు ‘jharkhandstatelogo@gmail.com’కు తెలియజేయాలని కోరారు.
ముఖ్యమంత్రిగా హేమంత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా కేబినెట్ సమావేశంలో ఈ కొత్త లోగో ఏర్పాటుపై చర్చ జరిగింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రానికి కొత్త లోగోను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. జార్ఖండ్ సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా లోగో రూపకల్పన ఉండబోతోందని హేమంత్ సోరెన్ ప్రభుత్వం పేర్కొంది. (మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!)
కాగా.. గతేడాది డిసెంబర్‌లో జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం- కాంగ్రెస్- ఆర్జేడీ కూటమి ఘన విజయం సాధించి హేమంత్ సోరెన్ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే. 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్‌లో జేఎంఎం 29 స్థానాలు గెలుపొందగా, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 1 స్థానాన్ని గెలుచుకున్నాయి. గతంలో అధికారంలో కొనసాగిన బీజేపీ 25 సీట్లకు మాత్రమే పరిమితమైంది. బీజేపీ హయాంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన రఘుబర్ దాస్ సైతం ఓటమి పాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment