
‘అమ్మ’ గైర్హాజరీలో షీలా
చెన్నై: తమిళనాడు సీఎం జయలలిత ఆసుపత్రిలో చేరి పదిరోజులైనా ఆమె గైర్హాజరీలో తమిళనాడు పాలన సాగుతోంది. కానీ నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు? జయ కాకుండా ఆ స్థాయిలో నిర్ణయాలు తీసుకునే సత్తా ఉన్నవారెవరు? ఈ ప్రశ్నలకు సమాధానం షీలా బాలకృష్ణన్. 1976 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి అయిన షీలా.. సీఎం జయలలితకు నమ్మిన బంటు. రెండేళ్ల క్రితం రిటైరైనా ఈమెను జయ తన అధికారిక సలహాదారుగా నియమించుకున్నారు. అప్పటినుంచి పాలనలో షీలా కీలకంగా వ్యవహరిస్తున్నారు.
అపోలో ఆసుపత్రిలో జయ చికిత్స పొందుతున్న ఫ్లోర్‌లోనే ఓ గదిలో ఉంటున్న షీలా.. ఇక్కడినుంచే పాలనా వ్యవహారాలు చూస్తున్నారు. ‘ఆసుపత్రికి వచ్చే మంత్రులు రెండు పనులపై వస్తున్నారు. ఒకటి అమ్మను చూడటం, రెండోది షీలా సూచనలు అందుకోవటం’ అని ఓ అన్నాడీఎంకే కీలక నేత తెలిపారు. 3 దశాబ్దాలకు పైగా వివిధ హోదాల్లో పనిచేసిన షీలా బాలకృష్ణన్ అనుభవజ్ఞురాలని పలువురు ఐఏఎస్‌లు కొనియాడారు.