వాటర్ గ్రిడ్‌కు సహకరిస్తాం.. | CM urged the Centre to fund water grid | Sakshi
Sakshi News home page

వాటర్ గ్రిడ్‌కు సహకరిస్తాం..

Published Tue, Feb 10 2015 1:37 AM | Last Updated on Sat, Sep 2 2017 9:02 PM

వాటర్ గ్రిడ్‌కు సహకరిస్తాం..

వాటర్ గ్రిడ్‌కు సహకరిస్తాం..

  • కేంద్ర మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్
  • నిధులిచ్చేలా ప్రపంచబ్యాంక్ వంటి సంస్థలకు సిఫారసు చేస్తాం
  • బడ్జెట్‌లో తెలంగాణకు వీలైనన్ని నిధులు కేటాయిస్తాం
  • కేసీఆర్‌తో భేటీ అనంతరం కేంద్ర మంత్రి వెల్లడి
  • బీఆర్‌జీఎఫ్, ఉపాధి హామీసహా పలు అంశాలపై చర్చ
  • వాటర్ గ్రిడ్‌కు కేంద్ర నిధులివ్వాలని సీఎం విజ్ఞప్తి
  • సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు చాలా చక్కటి పథకమని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ పేర్కొన్నారు. రానున్న కేంద్ర బడ్జెట్‌లో అవకాశాన్ని బట్టి ఈ కొత్త పథకానికి కేంద్ర ప్రభుత్వం తరఫున సహాయం చేసేందుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. ఇది చాలా పెద్ద పథకం కావడంతో ఆర్థిక సహాయం కోసం ప్రపంచబ్యాంకు వంటి సంస్థలను సంప్రదించాలని.. అవసరమైతే కేంద్రం తరఫున సిఫారసు చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు హమీ ఇచ్చారు.

    సోమవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ఢిల్లీలోని కృషిభవన్‌లో కేంద్ర మంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌తో భేటీ అయ్యారు. మంత్రి కేటీఆర్, టీఆర్‌ఎస్ ఎంపీలు ఏపీ జితేందర్‌రెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి, బీబీ పాటిల్, ఢిల్లీలో రాష్ట్ర ప్రతినిధులు వేణుగోపాలాచారి, రామచంద్రు తేజావత్, పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ వాటర్ గ్రిడ్ ఉద్దేశం, లక్ష్యాలను కేంద్ర మంత్రికికేసీఆర్ వివరించారు. ఈ పథకానికి రాష్ట్రం భారీగా నిధులు వెచ్చిస్తోందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకాన్ని అమలుచేసేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ నుంచి ఆర్థిక సాయం అందించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.

    ఇక తెలంగాణలో తొమ్మిది జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించినా... బీఆర్‌జీఎఫ్ (బ్యాక్‌వర్డ్ రీజియన్స్ గ్రాంట్ ఫండ్) కింద మూడు జిల్లాలకే నిధులు ఇస్తున్నారని, అన్ని జిల్లాలకు నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఉపాధి హామీ పథకం అమలు మండలాల సంఖ్య తగ్గిస్తున్నట్టు వస్తున్న వార్తలను కేంద్ర మంత్రి వద్ద కేసీఆర్ ప్రస్తావించారు. అదే విధంగా రాష్ట్ర విభజనకు ముందున్న గణాంకాల ప్రకారం పేదరికాన్ని లెక్కలోకి తీసుకుంటున్నారని.. వాస్తవ పరిస్థితుల ఆధారంగా తెలంగాణలో పేదరికాన్ని గుర్తించాలని కోరారు. కేసీఆర్‌తో భేటీ అనంతరం బీరేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడారు.

    వాటర్ గ్రిడ్ గురించి కేసీఆర్ చెప్పారని, ఈ కొత్త పథకానికి వీలైనంత సహకారం అందించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. కేంద్ర బడ్జెట్ వచ్చిన తర్వాత తెలంగాణ వాటాకు తమ శాఖ నుంచి వచ్చే నిధులు కేటాయిస్తామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. బీఆర్‌జీఎఫ్ నిధుల కేటాయింపులపై విలేకరులు ప్రశ్నిం చగా... ‘‘ప్రస్తుతానికి తెలంగాణలోని నాలుగు జిల్లాలకు బీఆర్‌జీఎఫ్ కింద నిధులు కేటాయించాం.

    ఇందులో మూడు జిల్లాలు అదనపు నిధుల కోసం అడిగాయి. అయితే మేం జిల్లాను ఒక యూనిట్‌గా కాకుండా, బ్లాక్ ఆధారంగా నిధులు కేటాయిస్తున్నాం. అందులో మరికొన్ని జిల్లాలు రావొచ్చు. కొన్ని సంపన్న బ్లాకులు బయటికి వెళ్లొచ్చు..’’ అని బీరేంద్రసింగ్ చెప్పారు. ఉపాధి హామీ మండలాల తగ్గింపును ఒక జిల్లాలోనో, ఒక రాష్ట్రంలో చేయడం లేదని దేశవ్యాప్తంగా ఒకే విధానాన్ని అనుసరిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement