పారిశ్రామికవేత్తలను బలి చేయొద్దు
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమార మంగళం బిర్లాకు బాసటగా పారిశ్రామిక వర్గాలు గళమెత్తాయి. ప్రభుత్వ చర్యలు పెట్టుబడిదారులకు ఇబ్బంది పెట్టేలా ఉన్నాయంటూ ఆరోపించాయి. వ్యాపారవేత్తలపై కేసులు నమోదు చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశాయి. బొగ్గు కుంభకోణంపై రాజధానిలో రాజకీయ పక్షాల మధ్య నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మంత్రి వర్గంలోని కొంత మంది మంత్రులు కూడా సీబీఐ చర్యపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ప్రధానిని మాత్రం వెనకేసుకొచ్చారు. మరోపక్క ప్రధాని రాజీనామాకు బీజేపీ పట్టుబట్టింది.
కామన్వెల్త్ గేమ్స్, 2జీ స్కాంలో ఫైల్స్‌పై సంతకాలు చేసినవారిదే బాధ్యత అంటూ అరెస్ట్ చేసిన విధంగానే ప్రధానిపై కూడా కేసు పెట్టాలని బీజేపీ వాదించింది. పరేఖ్ ప్రశ్నకు సమాధానం చెప్పాలని పార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. కాగా, ఏవో చిన్న చిన్న అనుమానాలు, వక్రీకరణలపై పారిశ్రామికవేత్తలను బలిపశువులను చేయవద్దని పారిశ్రామిక వర్గాలు కోరాయి. ఇలాంటి వాటి వల్ల ప్రభుత్వానికి, పరిశ్రమ వర్గాలకి మధ్య నమ్మకం సన్నగిల్లుతుందని తెలిపాయి. ఈ పరిణామాలు జాతి మనోభావాలను దెబ్బతీస్తాయని, అంతేగాక ఇటు దేశీయ, అటు విదేశీ పెట్టుబడిదారుల నమ్మకాన్ని వమ్ము చేస్తాయని ఫిక్కీ ప్రెసిడెంట్ నైనా లాల్ కిద్వాయ్ చెప్పారు.
ఇది పెట్టుబడుల వాతావరణాన్ని కలుషితం చేస్తుందన్నారు. గౌరవంగా వ్యాపారాలు చేసేవారిని చిన్న చిన్న కారణాలు చూపించి బలిపశువులు చేయవద్దని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. బిర్లాైపై కేసు నమోదు కావడం పట్ల దేశంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆది గోద్రెజ్ చెప్పారు. ఇప్పటికే వోడాఫోన్ లాంటి కేసుల్లో తీవ్రంగా నష్టం జరిగిందని పేర్కొన్నారు. ఆర్ధికాభివృద్ధిలో వ్యాపారవేత్తల పాత్ర ఏంటో ప్రభుత్వం తెలుసుకోవాలని కనోరియా కెమికల్స్ సీఎండీ ఆర్‌వీ కనోరియా అన్నారు. సానుకూల వాతావరణం కల్పిస్తే దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. వ్యాపారవర్గాలన్నీ బిర్లాకు బాసటగా నిలుస్తాయని పీెహచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సుమన్ జ్యోతి ఖైతాన్ వెల్లడించారు. బిర్లాపై కేసు నమోదు చేయడం భారత కంపెనీలకు నిరుత్సాహాన్ని కలిగించిందని టెలికమ్యూనికేషన్స్ సీఈవో అరవింద్ బాలి అన్నారు. అజ య్ పిరామల్, ఆసోచామ్ కూడా బిర్లాకు బాసటగా నిలిచాయి.
కాగా, ప్రభుత్వ వర్గాలు మన్మోహన్‌ను వెనకేసుకువస్తున్నాయి. తాజాగా బొగ్గు శాఖ మంత్రి శ్రీప్రకాశ్ జైశ్వాల్ కూడా మన్మోహన్ నిజాయితీపై ఎవరూ సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చారు. సుప్రీం ఆధ్వర్యంలో విచారణ జరుగుతున్నందున ఇంతకంటే తానేమీ మాట్లాడడనన్నారు. కాంగ్రెస్ ప్రతినిధి రేణుకా చౌదరి కూడా జరుగుతున్న పరిణామాలపై స్పందించారు. నిజాలు నిగ్గుతేలేవరకూ ఎవరూ ఒక నిర్ణయానికి రాకూడదని చెప్పారు. బొగ్గు గనుల కేటాయింపులో ప్రభుత్వం దాచడానికి ఏమీ లేదని ప్రధాన మంత్రి కార్యాలయ సహాయ మంత్రి నారాయణసామి అన్నారు. రాష్ట్రాల సిఫార్సుపైనే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు బొగ్గు గనులు కేటాయిస్తారని చెప్పారు. గనులు అందుబాటులో ఉన్న రాష్ట్రాల ముఖ్యకార్యదర్శులతో కూడిన కమిటీ కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. మరోపక్క హిందాల్కో కార్యాలయంలో రూ.25 కోట్లను ఐటీ విభాగం జప్తు చేసింది. సీబీఐ సోదాల్లో ఈ మొత్తం పట్టుబడిన విష యం తెలిసిందే. ఐటీ చట్టం ప్రకారం ఈ డబ్బును జప్తు చేశామని, విచారణ చేపడతామని ఆ సంస్థ అధికారి చెప్పారు.
ఆర్థిక వ్యవస్థ నష్టాల్లో ఉన్న ప్రస్తుత తరుణంలో దేశీయ, విదేశీ పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించేలా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఆర్థిక పరిస్థితుల్ని అస్తవ్యస్థం చేసే పనులను అంగీకరించకూడదు. చాలా ఆందోళనకర పరిస్థితి అయితేనే జుడీషియరీ వ్యవస్థ కల్పించుకోవాలి.
- వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ
తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా.. ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనపుడు ఆర్థిక వ్యవస్థ మందగిస్తుంది. పెట్టుబడిదారుల నమ్మకాన్ని కూడా ఇవి వమ్ము చేస్తాయి.
- కార్పొరేట్ వ్యవహారాల మంత్రి సచిన్ పెలైట్
కేసును సుప్రీం కోర్టు పర్యవేక్షిస్తోంది. స్టేటస్ రిపోర్టులో సుప్రీంకు కావాల్సిన సమాచారాన్ని సమకూర్చి నెలాఖరులో సమర్పిస్తాం. ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వా త అందిన సమాచారంతో ఎఫ్‌ఐఆర్‌ను సమర్పించాం. తదుపరి విచారణలో ఇతర అంశాలను సేకరిస్తాం.
- సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా
పరేఖ్‌పై సీబీఐ కేసు నమోదు చేయడం పూర్తిగా అన్యాయం, అసంబద్ధం. పరిధులను అతిక్రమిస్తున్న సీబీఐ చర్యల్ని ఖండిస్తున్నా. పరేఖ్ నిజాయితీ పరుడైన అధికారి,
- మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ ఎన్. విఠల్
పరేఖ్‌తో ముఖాముఖి పరిచయం లేకపోయినా.. ఆయనో నిజాయితీ పరుడైన అధికారి అని విన్నా. తుది నిర్ణయం తీసుకున్న పీఎంవో, ప్రధానిపై కూడా కేసులు నమోదు చేయడం సరైందే. -మాజీ ఐఏఎస్ జి.సుందరం
నవీన్‌ను ప్రశ్నించనున్న సీబీఐ
బొగ్గు గనుల కుంభకోణంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను ప్రశ్నించడానికి సీబీఐ సిద్ధమవుతోంది. హిందాల్కో సంస్థకు గనులు కేటాయించాలని బొగ్గు మంత్రిత్వ శాఖకు 2005లో రాసిన లేఖపై ఆరా తీసే అవకాశం ఉంది. గనుల కేటాయింపులో జరిగిన అక్రమాలపై పత్రాలు పరిశీలిస్తున్న సమయంలో నవీన్ పట్నాయక్ రాసిన లేఖ లభ్యమైందని సీబీఐ వర్గాలు చెప్పాయి. తలాబిర-2వ గనికి సంబంధించి తిరస్కరించిన హిందాల్కో దరఖాస్తును పునఃపరిశీలించాల్సిందిగా ఆలేఖలో నవీన్ కోరారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.