కోల్‌గేట్ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు
ఢిల్లీ హైకోర్టుకు సుప్రీం ఆదేశం
ఎస్‌పీపీగా గోపాల సుబ్రమణియం
నియూమకానికి సీజేఐ మొగ్గు
న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటారుుంపు కుంభకోణం కేసుల విచారణకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయూలని సుప్రీంకోర్టు శుక్రవారం ఢిల్లీ హైకోర్టును ఆదేశించింది. సీబీఐ, ఈడీల దర్యాప్తు నేపథ్యంలో ఉత్పన్నమయ్యే కేసులను పరిష్కరించేందుకు వీలుగా వారంలోగా ప్రత్యేక జడ్జి పేరును ప్రకటించాలని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరింది. దేశ రాజధానిలోని ప్రత్యేక కోర్టు ముందు విచారణ కార్యకలాపాల నిర్వహణ నిమిత్తం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఎస్‌పీపీ)గా ప్రముఖ న్యాయవాదిని నియమించాలని కూడా చీఫ్ జస్టిస్ ఆర్.ఎం.లోధా నేతృత్వంలోని సుప్రీం బెంచ్ నిర్ణరుుంచింది. ఢిల్లీ అత్యున్నత న్యాయ విభాగానికి చెందిన ఓ అధికారిని ప్రత్యేక జడ్జిగా నియమించేందుకు చీఫ్ జస్టిస్ నుంచి ఉత్తర్వులు పొందాల్సిందిగా సూచిస్తూ.. ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు లేఖ రాయూల్సిందిగా సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌ను ఆదేశిస్తున్నట్టు తెలిపింది.
ఎస్‌పీపీని ఏకగ్రీవంగా ఎంపిక చేసేందుకు వీలుగా అందరూ కలిసి సంప్రదింపులు జరపాలని సూచించింది. ఇందుకోసం స్వేచ్ఛాయుతమైన న్యాయ ధృక్పథం, నిజారుుతీ కలిగిన వ్యక్తి కావాలనే ఆకాంక్ష వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. తమ తొలి ప్రాధాన్యతగా సీనియర్ న్యాయవాది గోపాల్ సుబ్రమణియం పేరును ప్రస్తావించింది. ఈ బాధ్యతలు స్వీకరించేందుకు ఆయన్ను ఒప్పించాల్సిన అవసరం ఉందంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించే విషయంలో సుబ్రమణియం పేరును కేంద్రం పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఆయన్నే బొగ్గు కుంభకోణం కేసులకు సంబంధించి ఎస్‌పీపీగా నియమించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొగ్గు చూపడం విశేషం.