లాక్‌డౌన్‌: సాయం చేస్తానని తోడుగా వచ్చి.. | Colombian Woman Claims Mumbai Cop Molest Her | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌: పోలీస్‌ కదా అని నమ్మి వెళ్తే..

Published Wed, Apr 22 2020 7:09 PM | Last Updated on Wed, Apr 22 2020 8:09 PM

Colombian Woman Claims Mumbai Cop Molest Her - Sakshi

ముంబై: కరోనా లాక్‌డౌన్‌తో భారత్‌లో చిక్కుకున్న కొలంబియా మహిళ పట్ల ముంబై పోలీసు ఒకరు అనుచితంగా వ్యహరించాడు. సాయం చేస్తానని చెప్పి లైంగిక వేధింపులకు దిగాడని ఈ మేరకు బాధితురాలు ముంబై పోలీస్‌ అధికారులకు ఈమెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రకారం..  ‘టూరిస్టు వీసాపై భారత్‌కు వచ్చాను. ఫిబ్రవరి 22న ముంబైకి చేరుకుని బాంద్రాలోని ఓ హోటల్‌లో మార్చి 31 వరకు ఉన్నాను.

డబ్బులు అయిపోవడం, లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు తలెత్తడంతో ఢిల్లీలోని కొలంబియా ఎంబసీని సంప్రదించాను. అయితే, ఫ్లైట్‌ సర్వీసులు రద్దు కావడంతో తిరిగి ముంబైకి వెళ్లిపోదామనుకున్నాను. ఈ క్రమంలో ముంబైకి చెందిన ఓ పోలీస్‌ అంధేరీలో లాడ్జ్‌ వెతికిపెట్టాడు. ఏప్రిల్‌ 1న లాడ్జ్‌లో దిగాను. అక్కడ సదరు పోలీస్‌ ప్రవర్తన నన్ను ఇబ్బందులకు గురిచేసింది. నన్ను డ్రింక్‌ తాగాలని బలవంతం చేశాడు. తిరస్కరించాను. నా ఫోన్‌కు అసభ్యకర మెజేస్‌లు పంపించాడు. నన్ను తాకేందుకు యత్నించాడు. లాడ్జ్‌ అద్దె తానే చెల్లిస్తానని, తనను రూమ్‌లోకి ఆహ్వానించాలని కోరాడు. అతన్ని బయటికి నెట్టేశాను.
(చదవండి: కరోనా అనుమానంతో ఆసుపత్రిలో చేరిక)

దాంతో అతను నాపై కక్ష కట్టాడు. నాకు ఎలాంటి సౌకర్యాలు కల్పించొద్దని లాడ్జ్‌ సిబ్బందిని హెచ్చరించాడు. నిత్యవసరాలు లేక నరకం అనుభవించాను. నా వ్యధనంతా వీడియో రూపంలో కొలంబియా అధికారులకు పంపించడంతో వైరల్‌ అయింది. దానికి స్పందనగా ఏప్రిల్‌ 18న ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు, ఒక డాక్టర్‌ నా వద్దకు వచ్చి ఆహారం అందించారు. ఆరోగ్య పరీక్షలు చేశారు.  క్లిష్ట సమయంలో తోడుగా నిలిచారు.  చివరకు ఓ ఎన్‌జీఓ సాయంతో లాడ్జ్‌ నుంచి బయటపడి.. వారి సంరక్షణలో ఉన్నాను. కీచక పోలీస్‌ ఆటకట్టించేందుకే ఫిర్యాదు చేస్తున్నాను’అని పేర్కొన్నారు. కాగా, బాధితురాలి ఫిర్యాదుపై విచారిస్తామని.. ఆరోపణలు నిజమైతే సదరు పోలీస్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్‌ ఉన్నతాధికారులు తెలిపారు. నిందితుడు సహర్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్టున్నట్టు తెలిసింది.
(చదవండి: దేశవ్యాప్తంగా 20,000 దాటిన పాజిటివ్‌ కేసులు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement